Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు తప్పుకుంటారా? తన బదులు కోడలు బ్రాహ్మణిని బరిలో దించుతారా? తాను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈసారి కుప్పం నుంచి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి మారి చాలా రోజులవుతోంది. వరుస విజయాలతో కుప్పంను పెట్టని కోటగా చంద్రబాబు మార్చుకున్నారు. అయితే ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసిపి కసిగా పని చేస్తోంది.
గత ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. అంతకుముందు ఎన్నికల్లో 40 వేల మెజారిటీకి పైనే చంద్రబాబు సాధిస్తూ వచ్చారు. కానీ గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో మెజారిటీ తగ్గింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే పూర్తిస్థాయిలో పట్టు సాధించిన పెద్దిరెడ్డి.. టిడిపి కేడర్ను వైసీపీ వైపు టర్న్ అయ్యేలా పావులు కదిపారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించారు. అప్పటి నుంచే వై నాట్ కుప్పం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. కుప్పంను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో పాటు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవన్నీ కలిసి వస్తాయని వైసిపి భావిస్తోంది.
అయితే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు ఒక రకమైన కలవరపాటు కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు తరచూ కుప్పం పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. గత ఏడాది కాలంలో ఏకంగా కుప్పం నియోజకవర్గంలో 8 సార్లు చంద్రబాబు పర్యటించారు. ఇలా చంద్రబాబు పర్యటన సమయాల్లో వైసీపీ శ్రేణులు అడ్డు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు భరత్ అనే నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన జగన్.. ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో భరత్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ ప్రకటించారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత తేలిక పని కాదని జగన్ కు తెలుసు. అయినా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.
చంద్రబాబును మానసికంగా దెబ్బ కొట్టేందుకు సైతం వైసీపీ సిద్ధపడింది. చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకుంటారని.. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఇది నిజమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో వరుస అపజయాలు చంద్రబాబులో అనుమానాలను పెంచాలని.. దాని ఫలితంగానే ఆయన కుప్పం నియోజకవర్గంలో వదులుకోవడానికి సిద్ధపడతారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే అదంతా ఉత్తమాటేనని.. కుప్పం నుంచి మరోసారి చంద్రబాబు బరిలో దిగడం ఖాయమని.. అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా.. చంద్రబాబుకు రికార్డు స్థాయిలో మెజారిటీ ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు. కాగా ఈనెల 28 నుంచి మూడు రోజులు పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.