Badvel bypoll: కడప జిల్లా బద్వేల్ లో జరిగే ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు పోటీపడనున్నాయి. ఇప్పటికే తమ అభ్యర్థులను సైతం ప్రకటించాయి. కానీ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సంచలన ప్రకటన చేశారు. బద్వేలు బరిలో ఉండడం లేదని ప్రకటించి అందరిలో అనుమానాలు పెంచారు. పవన్ నిర్ణయంతో బీజేపీ భవిష్యత్ పై గందరగోళం ఏర్పడింది. ఏకగ్రీవానికే తాను మద్దతు తెలుపుతున్నానని ప్రకటించి చర్చలకు తెరలేపారు. దీంతో బీజేపీ డైలమాలో పడుతోంది. పవన్ తన మనసులోని మాట చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ మాతోనే ఉన్నారని చెప్పుకున్నా ప్రస్తుతం వారి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పోటీలో నిలిచినా గెలుస్తుందా అనే సంశయాలు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ వ్యూహమేంటి అనే విధంగా అందరు ఆలోచనలో పడిపోయారు.
చనిపోయిన వ్యక్తిని గౌరవించే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వవన్ కల్యాణ్ ప్రకటించారు. ఏకగ్రీవం కోసమే తన మద్దతు ఉంటుందని తెలిపారు. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఇక్కడ ప్రశ్నార్థకమే కానుందని సమాచారం. ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి. వైఎస్సార్ సీపీ కూడా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భార్య సుధను ప్రకటించింది.
బద్వేల్ లో పోటీ చేయాలని ఒత్తిడి పెరిగినా పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పడంతో బీజేపీ పునరాలోచనలో పడింది. పవన్ కల్యాణ్ మద్దతుతో పోటీ చేయాలని ఆలోచించినా ఆయన ప్లేటు ఫిరాయించడంతో ఏం చేయాలో అని ఆలోచిస్తోంది. మొత్తానికి పవన్ నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని తెలుస్తోంది.