Pulwama Attack: పుల్వామా.. ఈ పేరు చెప్తే భారతీయ సైన్యం కంటనీరు పెడుతుంది.. దేశం కూడా దిగ్భ్రాంతికి గురవుతుంది. నాటి నెత్తుటి గాయాన్ని తలచుకుని ఆవేదన చెందుతుంది.. 2019లో జరిగిన ఈ దారుణంలో 40 మంది సైనికులను భారతదేశం కోల్పోయింది.. ఈ ఘటన జరిగి మూడేళ్లు అవుతున్నా వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఒక్క పైసా పరిహారం కూడా రాలేదు. దీంతో ఆ కుటుంబాలు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ రాజస్థాన్ ప్రభుత్వానికి వీసమెత్తు చలనం కూడా ఉండటం లేదు. పైగా వారిని అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం తీరు పై విసిగి వేసారిన అమర వీరుల భార్యలు ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్ కల్రామ్ మిశ్రాను కలిశారు. ప్రభుత్వం ఎలాగూ పరిహారం ఇవ్వదు. తమకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాధేయపడ్డారు.. తనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో చావడం తప్ప మరో మార్గం లేదంటూ ఆయన ఎదుట వాపోయారు.. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తమ భర్తల పేరిట స్మారకాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డుకున్నారు
గవర్నర్ ను కలిసిన అనంతరం వారు రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని లోపలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.. పోలీసులు అమర జవాన్ల భార్యలను తోసి వేశారు. వీరిలో రోహితా శవ్ లాంబా అనే అమర జవాన్ భార్య మంజు గాయపడింది. ఇక తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొన్ని రోజులుగా వీర జవాన్ల భార్యలను ధర్నా చేస్తున్నారు.. కానీ రాజస్థాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. పైగా వారికి పరిహారం ఇచ్చామని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది.
రాజకీయ రంగు పులుముకుంది
ఇక పుల్వామా అమర జవాన్ల భార్యల పై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.. అధికార కాంగ్రెస్ పార్టీ సైనిక కుటుంబాలకు ఎంతటి మర్యాద ఇస్తుందో చూస్తున్నారు కదా అని బిజెపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి అమరవీరుల భార్యలతో రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇరు పార్టీలు ఆరోపణలు, ప్రత్యా రోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.. ఇంత జరుగుతున్నప్పటికీ అమర జవాన్ల భార్యలకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఒక్క హామీ కూడా రాకపోవడం విశేషం.