Uniform Civil Code: యూసీసీ పై ఎందుకింత రగడ?

దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఇది చర్చనీయాంశంగా ఉంది. హిందూ మహిళలకు విడాకులు తీసుకునే హక్కు లేకపోవడంతో ఈ చట్టం తేవాలని డిమాండ్ అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ నుంచి వచ్చింది.

Written By: Bhaskar, Updated On : July 12, 2023 10:10 am

Uniform Civil Code

Follow us on

Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్.. తెలుగులో చెప్పాలంటే ఉమ్మడి పౌర స్మృతి.. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశం ఇప్పటిది కాదు స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి చర్చల్లో ఉన్నది. ప్రస్తుతం మరికొద్ది నెలల్లో దేశంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దీనిని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. కొందరు దీనిని సమర్థిస్తున్నారు. మరి కొందరు అంటే మతపరమైన మైనారిటీలు, ఆదివాసీలు, గిరిజన తెగల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు యూనిఫాం సివిల్ కోడ్ పై ఎందుకింత చర్చ జరుగుతోంది? కెసిఆర్ లాంటి వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీన్ని సమర్థించే వారు ఎటువంటి వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు?

భిన్నత్వానికి వేదిక

29 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల సమ్మిళితమైన ఈ దేశంలో ఎన్నో ఆచారాలు, మరెన్నో వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఇన్ని రకాల మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసి ఉండడం ప్రపంచంలో కేవలం భారతదేశానికి మాత్రమే చెల్లింది. అటువంటి ఈ దేశంలో ప్రత్యేకంగా ఉమ్మడి పౌర స్మృతి అనేది లేదు. ఎవరికి వారు నచ్చినట్టు బతకడమే ఈ దేశంలో మొదటి నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇక ఈ సువిషాల భారత దేశంలో దొంగతనం, అత్యాచారం, హత్య.. ఈ నేరాలు చేసిన వారు ఎవరైనా సరే.. వారిది ఏ మతం? ఏ కులం అనే దాంతో సంబంధం లేకుండా కోర్టులు శిక్ష విధిస్తాయి. కానీ రెండవ పెళ్లి, విడాకులు, భరణం, దత్తత స్వీకారం, వారసత్వం, మహిళలకు ఆస్తి హక్కు వంటి విషయాల్లో మాత్రం అందరికీ ఒకే చట్టం వర్తించదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో ఇదే కొనసాగుతోంది. ఈ విషయాల్లో చట్టాల కంటే మత సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నది. హిందువుల్లో పెళ్లి, విడాకులు వంటివి హిందూ వివాహ చట్టం ప్రకారం జరుగుతున్నాయి. షరియా ఆధారంగా రూపొందిన “ముస్లిం పర్సనల్ లా” స్ నిర్దేశించిన విధంగా ముస్లింలు నడుచుకుంటారు. క్రైస్తవులు వారి మత సంప్రదాయాలను పాటిస్తారు.. ఇలాంటి విషయాల్లో ఆదివాసీలు చాలా పట్టింపుతో ఉంటారు. తరతరాలుగా తాము అనుసరిస్తున్న సంప్రదాయాలను కాదని వారు ఇతర మార్గాలను అనుసరించేందుకు ఇష్టపడరు. ఒకే మతంలో కూడా ప్రాంతానికి సంబంధించిన ఆచారాలు భిన్నంగా ఉంటాయి. రాష్ట్రాల వారీగా కూడా వేరువేరుగా చట్టాలు ఉంటాయి. మతం ఒకటే అయినప్పటికీ… ఆస్తి పంపకానికి సంబంధించిన చట్టాలు ఒక రాష్ట్రంలో ఒకలాగా, మరొక రాష్ట్రంలో మరొక లాగా ఉన్నాయి. ఇలా ఎవరికి వారు తమ తమ సంప్రదాయాలను అనుసరించడం వల్ల, వేరువేరు చట్టాల వల్ల సమాజంలో అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని.. అలా కాకుండా పెళ్లి, విడాకులు, భరణం, దత్తత, వారసత్వం, ఆస్తి హక్కు వంటి వాటి విషయంలో రాష్ట్రాలకు, మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం ఉండాలన్న వాదనకు రూపమే ఉమ్మడి పౌర స్మృతి..

స్వాతంత్రం రాక ముందు నుంచి

దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఇది చర్చనీయాంశంగా ఉంది. హిందూ మహిళలకు విడాకులు తీసుకునే హక్కు లేకపోవడంతో ఈ చట్టం తేవాలని డిమాండ్ అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ నుంచి వచ్చింది. దీంతో రాజ్యాంగ రచన జరిగేటప్పుడు రాజ్యాంగ కమిటీ దీనిపై విస్తృతంగా చర్చించింది. బీఆర్అంబేద్కర్ సైతం ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగా వాదించారు. అయితే ఇది వాంఛనీయం అయినప్పటికీ దేశం మొత్తం దీన్ని ఆమోదించడానికి సిద్ధమయ్యేదాకా స్వచ్ఛందంగా అమలు కావాలని ఆయన అప్పట్లో అభిప్రాయపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని సబ్ కమిటీ దీని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలా? వద్దా? అనే అంశంపై అప్పట్లో ఓటింగ్ నిర్వహిస్తే 5_4 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఫలితంగా ఉమ్మడి పౌర స్మృతిని రాజ్యాంగ కమిటీ ఆదేశిక సూత్రంలో చేర్చింది. దేశంలోని ప్రజలందరికీ ఒకే సివిల్ చట్టం ఉండేలాగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించాలని రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్నది. అనంతర కాలంలో నెహ్రూ ఆధునిక పౌరస్మృతి పేరిట కొత్త చట్టం తేవాలని భావించినప్పుడు కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అప్పట్లో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కాలంలో దీనిపై తరచూ డిమాండ్లు వినిపించినప్పటికీ శాబానో కేసు నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి అంశం మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.

శాబానో కేసు ఏంటంటే..

శాబానో అనే మహిళకు ఆమె భర్త ట్రిబుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. భరణం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించాడు. సుప్రీంకోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని ఆదేశిస్తే.. ముస్లిం మహిళలకు భరణం విషయంలో సిఆర్పిసి చెల్లదని నాటి రాజీవ్ సర్కార్ చట్టం చేసింది. అప్పటినుంచి యుసిసి కోసం డిమాండ్లు బలంగా వినిపించడం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు కూడా దాని ఆవశ్యకతను పలు సందర్భాల్లో వెల్లడించింది. లా కమిషన్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి యూసీసీ వాంఛనీయం కాదని, దాని అవసరం లేదని 2018లో నివేదిక ఇచ్చింది. బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై అడుగులు ముందుకే వేయడం విశేషం.