కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుకు అమ్మేస్తామని బాహాటంగా ప్రకటించింది. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి చెప్పింది. అమ్ముడుపోతే అమ్ముతాం.. లేదంటే మూసేస్తాం అని తేల్చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. అవసరమైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని కూడా చెప్పారు. దీంతో.. కేటీఆర్ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.
Also Read: వైరల్: ఆస్పత్రి బెడ్ పై నుంచి మమతా బెనర్జీ వీడియో సందేశం
అయితే.. ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల గిమ్మిక్కు అన్నారు కాంగ్రెస్, ఇతర నేతలు. అయితే.. లోతుగా ఆలోచిస్తే అది మాత్రమే కాదని, ఇంకా వేరే విషయం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బీజేపీ తామే ప్రత్యామ్నం అని చెప్పుకోవడం.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడంతో గులాబీ దళంలో ఆందోళన మొదలైంది. జనాల్లో వ్యతిరేకత మొదలైందా? అనే ఆలోచనలో పడింది.
దీంతో.. అర్జెంటుగా బీజేపీకి చెక్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. మొన్నటి జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. టీఆర్ఎస్ ను కాపాడింది సెటిలర్లేనని స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఓట్లు గంప గుత్తగా గులాబీ పార్టీకే పడ్డాయి. రాష్ట్ర ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ప్రవర్తనతో భయపడినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో.. గులాబీ పార్టీని విశ్వసించిన సెటిలర్లు.. కేసీఆర్ వెనకే నిలబడ్డారు.
Also Read: అమెరికన్లకు హ్యాపీ న్యూస్.. 1.9 ట్రిలియన్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ
ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం ద్వారా బీజేపీ పక్షాన వాళ్లు నిలబడే ఛాన్స్ లేదు. ఈ పరిస్థితిని శాశ్వతం చేయాలని టీఆర్ఎస్ వ్యూహం రచించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణను వ్యతిరేకించడం ద్వారా.. అటు ఏపీ వాసులను దగ్గర చేసుకోవడం.. ఇటు తెలంగాణలోని సంస్థలను అమ్మకం పెట్టడానికి కూడా సిద్ధపడొచ్చు అనడం ద్వారా.. బీజేపీ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు అర్థం చేయించడానికి ప్రయత్నించారని అర్థమవుతోంది.
ఈ లెక్క ప్రకారమే కేటీఆర్ విశాఖ ఉక్కుకు మద్దతు ప్రకటించారని అంటున్నారు. అయితే.. నిజానికి కూడా కేంద్రం రెండు రాష్ట్రాలకూ అన్యాయమే చేస్తోందనే అభిప్రాయం బలంగా ఉంది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అయినప్పటికీ.. వాటిని ఉద్దేశపూర్వకంగానే తొక్కి పెడుతోందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితులు కలిసి ఉద్యమిద్దామని ప్రకటించడం కూడా అవసరమేనని అంటున్నారు. మొత్తంగా ఎటు చూసినా.. ఈ విషయంలో కేటీఆర్ స్పందన.. టీఆర్ఎస్ కు మంచి మైలేజ్ ఇచ్చేదననే మాట వినిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్