Jagan Delhi Tour: ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పరిణామమైనా సంచలనమే. చివరకు అధికారిక కార్యక్రమాల్లో నేతలు కలుసుకున్నా హాట్ టాపిక్ గా మారుతోంది. మొన్నటికి మొన్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోదీని చంద్రబాబు కలుసుకున్నారు. పరస్పరం మాట్లాడుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చాన్నాళ్ల తరవాత కలుసుకున్న తరువాత ఎంతటి ప్రత్యర్థులైనా కుశల ప్రశ్నలు వేసుకుంటారు. కానీ చంద్రబాబు అనుకూల మీడియా దానిని ఒక బూతద్దంలో చూపగా.. వ్యతిరేక మీడియా మాత్రం అతి చేస్తున్నారంటూ కథనాలు వండి వార్చింది. అదే సమయంలో ప్రధాని మోదీతో జగన్ కలిసి భోజనం చేశారంటూ వార్తలను ప్రసారం చేసింది. అయితే అవన్నీ రహస్య భేటీలు కాదు. అధికారిక కార్యక్రమాలని గుర్తించుకోకుండా రాజకీయ కోణంలో చూసి ఎవరికి వారు అనుకూలంగా మార్చుకున్నారు.
ఇప్పుడు మరోసారి అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న రామోజీరావుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. చంద్రబాబు కూడా భేటీకి హాజరయ్యారని తెగ ప్రచారం చేశారు. కానీ ఆయన హాజరుకాలేదు. కానీ రామోజీరావు భేటీపై మాత్రం టీడీపీ తెగ సంబరపడిపోతోంది. బీజేపీతో సయోధ్య కుదర్చడానికే రామోజీరావు సమావేశమయ్యారని.. ఇదో మంచి పరిణామంగా ముక్తాయించుకుంటోంది. అదే సమయంలో వైసీపీలో కొంత కలవరపాటుకు గురైంది. గత మూడేళ్లలో లేని విధంగా బీజేపీ కేంద్ర పెద్దలు టీడీపీకి సానుకూలంగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
మీడియాకు తెలిసేలోగా…
ఇప్పడు ఏపీ నాట మరో హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. అదే సీఎం జగన్ ఢిల్లీ టూర్. మంగళవారం ఆయన ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తారని వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లేదు. కానీ ఇంతలో ఏమయ్యిందో తెలియదు కానీ..సోమవారం మీడియాకు తెలిసేలోపే ఆయన ఢిల్లీలో వాలిపోయారు. అయితే ఇది హడావుడిగా జరిగిందా? లేకుంటే గోప్యత పాటించారా? అన్నది మాత్రం తెలియడం లేదు. సీఎం పర్యటనను ఆలస్యంగా బయటపెట్టినట్టు మాత్రం తెలుస్తోంది. సోమవారమే జగన్ ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఉన్నపలంగా సీఎం ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి. ఇటీవల బీజేపీ టీడీపీకి దగ్గరైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ కలవరపాటుకు గురయ్యారా? లేదా? ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకా? అన్నది మాత్రం బయటికి వెల్లడి కావడం లేదు. అయితే జగన్ కలిసిన ప్రతీసారి ఏదో ఒక రాజకీయ అంశం అజెండాగానే కేంద్ర పెద్దలను కలుస్తుంటారు. ఈ సారి అటువంటి దానికే కలిసి ఉంటారన్న అనుమానం అయితే ఉంది.
నేతన్న హస్తం వాయిదా..
వాస్తవానికి మంగళవారం సీఎం జగన్ నేతన్న హస్తం పథకాన్ని ప్రారంభించాలి. కృష్ణా జిల్లాలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మరీ జగన్ ఢిల్లీ వెళ్లిపోయారు. ఒక్క పథకం ప్రారంభ తేదీ వెల్లడించిన తరువాత వాయిదా వేయడం అనేది ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక వాయిదా వేసి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది.