https://oktelugu.com/

India Sleep Crisis: ఇండియాలో ఎందుకు నిద్ర కరువైంది…? కారణాలేంటి?

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ చూడడం బాగా పెరిగిపోయింది. రాత్రిపూట మంచం ఎక్కిన తర్వాత చాలామంది సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 10, 2024 / 02:41 PM IST

    India Sleep Crisis

    Follow us on

    India Sleep Crisis: ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అంటారు.. కానీ మారిన జీవనశైలి వల్ల నిద్ర సుఖం చాలామందికి దూరం అవుతోంది. ఈ సమస్యపై రెస్ మెడ్ స్లీప్ సర్వే నిర్వహించింది.. ఆ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా కంటి నిండా నిద్రపోయేది కేవలం 27% మందేనట.. వీరు రోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారట మిగతావారు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట. నిద్రలేమి వల్ల ఎన్నో వ్యాధులు ఎదుర్కొంటున్నారట.. పని ఒత్తిడి వల్లే చాలామందికి నిద్ర పట్టడం లేదట.. మారుతున్న జీవన శైలి.. పెరుగుతున్న ఒత్తిళ్లు మనిషి కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తగినంత నిద్ర లేకపోతే శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. తలనొప్పి, చికాకు, కోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

    36 వేల మందిని పరిశీలించింది

    ఇటీవల రెస్ మెడ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 36,000 మంది జీవనశైలిని పరిశీలించింది. ఈ సర్వేలో 27% మంది మాత్రమే కంటినిండా నిద్రపోతున్నారని తేలింది. ఇదే సంస్థ 2023లో సర్వే నిర్వహిస్తే సుమారు 80 శాతం మంది మాత్రమే తగినంత నిద్రపోతున్నట్టు తెలిసింది. కేవలం ఒక సంవత్సరంలోనే పరిస్థితి దారుణంగా మారిపోయింది. కాగా, విపరితమైన ఒత్తిడి వల్లే మాకు కునుకు ఉండడం లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 42% మంది తెలిపారు. ఇక దక్షిణాది రాష్ట్రాలలో 38 శాతం మంది విపరీతమైన పని ఒత్తిడి వల్ల రాత్రి సమయంలో సరిపడా నిద్రపోవడం లేదు. ఇక ఇది ఉత్తరాది రాష్ట్రాలలో 42 శాతంగా ఉంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల పని ప్రదేశాలలో పూర్తిస్థాయిలో పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నామని వారు చెబుతున్నారు..

    మారిన జీవనశైలి

    ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ చూడడం బాగా పెరిగిపోయింది. రాత్రిపూట మంచం ఎక్కిన తర్వాత చాలామంది సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నారు. ఇది నిద్రలేమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల దాని ప్రభావం శారీరకంగా, మానసికంగా శరీరంపై పడుతుందని వైద్యులు చెప్తున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడే వ్యక్తులు ఇతర వ్యాధులకు త్వరగా గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల రాత్రివేళ నిద్రపోయేందుకు ఇబ్బంది ఎదురవుతున్నది. పగటిపూట అలసటకు గురవుతారు. చిరాకు, నిరాశ, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. శారీరకంగా చురుకుదనం ఉండదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. మరీ ముఖ్యంగా రోజుకు 6 నుంచి 8:00 కంటే తక్కువ పడుకుంటే రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయదు. దీనివల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, ప్రయాణం వేళల్లో మార్పులు, పని వేళల్లో మార్పులు, రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం, పడుకునే ముందు ఎక్కువగా తినడం, పగటిపూట నిద్రపోవటం, కొన్ని రకాల మందులు, మానసిక రుగ్మతలు, ఇతర కారణాలు వంటివి నిద్రలేమికి కారణమని వైద్యులు అంటున్నారు.

    ఇలా చేస్తే సుఖవంతమైన నిద్ర

    పౌష్టికాహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. పడుకునే ముందు శరీరాన్ని, మనసును ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.. వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని చెబుతున్నారు. నిద్రపోవడం, నిద్ర లేవడం వంటి వేళల్లో సమయాన్ని పాటించాలని చెబుతున్నారు. నిద్రకు ఉపక్రమించే రెండు గంటలకు ముందు కంప్యూటర్లు, టీవీలు, వీడియో గేమ్ లు, స్మార్ట్ ఫోన్ లు వాడకూడదని చెప్తున్నారు. ఇన్ని చేసినా నిద్ర పట్టకపోతే ఉదయాన్నే లేచి కొంత సమయం ఈ ఎండలో గడపాలని చెబుతున్నారు. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల నిద్ర నుంచి తరచుగా మేల్కొనే వంటి అలవాటును నివారించుకోవచ్చు. పడుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో టీ లేదా కాఫీ తాగకూడదు. అన్నింటికీ మించి ఎక్కువగా ఆలోచించకూడదు. నిద్ర లేమి సమస్యతో బాధపడేవారు నిద్ర మాత్రలు వేసుకుంటారు. అలాంటివారు ఎక్కువకాలం వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, ఇతర దుష్పరిణామాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.