spot_img
Homeజాతీయ వార్తలుY. S. Sharmila: షర్మిల ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఏం జరుగుతోంది?

Y. S. Sharmila: షర్మిల ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఏం జరుగుతోంది?

Y. S. Sharmila: సొంత పార్టీ పెట్టుకుంది. పాద యాత్ర చేసింది. కేసీఆర్ కుటుంబం మీద విమర్శలు చేసింది. నాలుగైదు సార్లు అరెస్టు అయింది.. అంతేకాదు పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది. ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థ (జగన్ మీద విరోధం కాబట్టి) అప్పట్లో షర్మిలకు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. వార్తల్లో వ్యక్తిని చేసింది. షర్మిల కూడా రెట్టించిన ఉత్సాహంతో పలు ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించింది. రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకొస్తానని ప్రకటించింది. ఎన్నికలకు ముందుగానే మేనిఫెస్టో ప్రకటించి ఆసక్తి రేకెత్తించింది. ఏకంగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ఆ ఉత్సాహం చప్పున చల్లారిపోయింది.

విలీనం ఉంటుందా

కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత షర్మిల పార్టీలో ఉత్సాహం దాదాపుగా తగ్గిపోయింది. అప్పట్లో అడపా దడపా ప్రెస్ మీట్ లు పెట్టే ఆమె .. ఇప్పుడు ఆ ఊసు కూడా మర్చిపోయారు. కేవలం ట్విట్టర్లో మాత్రమే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మరణం లో కనిపించని కోణం ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత యాక్టివ్ రాజకీయాల గురించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీకే శివకుమార్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఆమె డీకే శివకుమార్ ను రెండుసార్లు కలిశారు.. ఇందులో అంతరార్థం కూడా అదే అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. మరోవైపు షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏపీ కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం ఉంటుందన్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె తెలంగాణలో మాత్రమే పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది..

ఎక్కడి నుంచి పోటీ చేస్తారు

మధ్య ఖమ్మంలో పాదయాత్ర నిర్వహించినప్పుడు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. వైయస్ విజయలక్ష్మి ని ఆహ్వానించి పాలేరులో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఇక్కడినుంచి పోటీ చేస్తానని పద సందర్భాల్లో ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకో ఈ నియోజకవర్గానికి రావడం కూడా మానేశారు. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీకి ఒక అధ్యక్షుడు ఉండేవారు. అయితే ఆమె తీరుతో విసిగి వేసారి పోయానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ఇటీవల వైయస్ జయంతి నిర్వహించిన సందర్భంగా షర్మిల కనీసం ఒక 200 మందిని కూడా సమీకరించలేకపోయారు. పైగా ఆమె పార్టీలో చేరిన ఇందిరా శోభన్ కూడా రాజీనామా చేశారు. ఈ ప్రకారం చూసుకున్నప్పటికీ ఆమె పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి నేత కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు గట్టి నాయకుడు కూడా లేరు. అయితే పార్టీని స్థాపించి భారీగా ప్రచారం చేసుకున్న షర్మిల తర్వాత ఎందుకనో తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అని రాజకీయ పార్టీలు యాక్టివ్ గా మారాయి. కానీ షర్మిల పార్టీ మాత్రం సైలెంట్ అయిపోయింది. తను ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతోంది. కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితం అయిపోయింది. మరి భవిష్యత్తు రోజుల్లో షర్మిల తెలంగాణ నుంచి పోటీ చేస్తారా? లేక డీకే శివకుమార్ చూపించినట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అక్కడి బాధ్యతలు స్వీకరిస్తారా? అని తేలాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version