RS 2000 Note Ban: పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో 2000 నోటు చలామణి ప్రారంభించింది. ఇది నల్లధనాన్ని మరింత పెంచుతుందని ఆర్థికవేత్తలు అప్పట్లో విమర్శించారు. అయితే ఇదే నిజమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చెబుతోంది. 2018 మార్చి 31 నాటికి 6.7 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉండేవి. ఇప్పుడు 10.8% మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. లావాదేవీలకు ఈ నోట్లను వాడటం లేదని గుర్తించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది. ఇందులో భాగంగానే “క్లీన్ నోట్ పాలసీ” అమలు చేయబోతోంది. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి అర్ధాంతరంగా నోట్ల రద్దు ప్రకటించిన కేంద్రం.. ప్రజల సౌకర్యార్థం 2000, 500 నోట్లు తీసుకొచ్చింది. కానీ 2000 నోటు వల్ల బ్లాక్ మనీ పెరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది
2000 నోటును ఉపసంహరించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆ నోట్లను దేశంలోని 19 ప్రాంతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మార్చుకునే అనుమతి ఇచ్చింది. అంతేకాదు బ్యాంకులు సైతం 2000 నోటును సర్కులేషన్ లో పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. 2000 నోట్లు ఉన్నవారు వచ్చే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో సబ్మిట్ చేసి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఒక్కొక్కరూ ప్రతి విడతలోనూ 20000 విలువైన నోట్లు మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 23 నుంచి 2000 నోటు మార్చుకునేందుకు వెసలుబాటు కల్పించింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన 2000 నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? 2019 నుంచి 2000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ సమాచార హక్కు చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అడిగిన ప్రశ్నకు పై జవాబు లభించింది. 2016 నవంబర్ 8న నరేంద్ర మోదీ ప్రభుత్వం 500,1000 నోట్లను రద్దు చేసిన విషయం విధితమే. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో ఆ నోట్ల వాటా 80 శాతానికి పైగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ముద్రణాలయాలు నిర్విరామంగా పనిచేసినప్పటికీ అంతస్థాయిలో కరెన్సీ త్వరగా ముద్రించడం కష్టమే. దీంతో 2000 నోట్ల ముద్రణను మొదలుపెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రమక్రమంగా ఆ నోట్లో ప్రింటింగ్ తగ్గించింది. 2016_17 ఆర్థిక సంవత్సరంలో 35,429.91 కోట్ల విలువైన 2000 నోట్లను ముద్రించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 2017_ 18 లో 1,115.7 కోట్ల నోట్లను, 2018_19 లో కేవలం 466.90 కోట్ల నోట్లను ముద్రించింది. ఆ తర్వాత 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది..
పెరిగిన నకిలీ నోట్లు
2015లో రిజర్వ్ బ్యాంక్ మహాత్మా గాంధీ సిరీస్_2005 లో కొత్త నెంబరింగ్ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టింది. అయితే వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగే వారు. కానీ పెద్ద నోట్లనే రద్దుచేసి 2000 నోట్లు ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016 లో దేశ వ్యాప్తంగా 2,272 నకిలీ 2000 నోట్లు పట్టుపడ్డాయి. 2020 లో వీటి సంఖ్య ఏకంగా 2.45 లక్షలకు చేరింది.
ఎవరు ఏమంటున్నారంటే
రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం పట్ల ఒక సెక్షన్ ఆర్థిక రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరొక సెక్షన్ మాత్రం పెదవి విరుస్తున్నారు. 2000 నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల నల్లధనాన్ని బాగా పోగు చేసిన వారు, అక్రమాలకు ఆస్కారం ఉన్న బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడతారని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్ల ముద్రణ నిలిపివేసింది. కానీ ఈలోగా అక్రమార్కులు తమ డబ్బును మొత్తం 2000 నోట్ల కట్టల్లోకి మార్చారని, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో వారు హతాశులవడం ఖాయమని వారు అంటున్నారు. మరోవైపు కొంతమంది ఆర్థికంగా నిపుణులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుని నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను డబ్బులు పంచనీయకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొందని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం వల్లే కేంద్రం ఇలాంటి ఆకస్మాత్తు నిర్ణయం తీసుకుందని వారు ధ్వజమెత్తుతున్నారు. ” నల్లధనాన్ని రూపుమాపేందుకు పెద్ద నోట్లు రద్దు చేశారు. తర్వాత ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా మారలేదు. ఇప్పుడేమో ఏకంగా 2000 నోటు ఉపసంహరించుకుంటున్నామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని” వారు ప్రశ్నిస్తున్నారు.