Balakrishna- ABN RK: నందమూరి బాలకృష్ణ పై ఆంధ్రజ్యోతి కక్ష పెట్టుకుందా? తొక్కేయాలని ప్రయత్నిస్తోందా? అందుకే బాలకృష్ణకు కనీస స్థాయిలో కూడా కవరేజ్ ఇవ్వడం లేదా? అసలు బాలకృష్ణ తో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఉన్న గొడవేమిటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ ఆందోళనలు, నిరసనలను ఆంధ్రజ్యోతి హైలెట్ చేస్తోంది. కానీ నందమూరి బాలకృష్ణ ఫోటోలు కానీ, వార్తలు కానీ రాకపోవడం విశేషం.
ఎల్లో మీడియాలో ఆంధ్రజ్యోతి ది ప్రత్యేక స్థానం. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్టు ఉంటుంది ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి. అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఆంధ్రజ్యోతిని తమ సొంత పత్రికలా ఆదరిస్తుంటారు. అక్కున చేర్చుకుంటారు. అటువంటి పత్రికలో మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత బాలకృష్ణ అలెర్ట్ అయ్యారు. పార్టీకి దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కానీ ఎక్కడ ఆంధ్రజ్యోతిలో ఈ వార్తలకు కవరేజీ లేదు.
నిన్న చంద్రబాబును పవన్ కలిశారు. బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి వెళ్లి జైలులో పరామర్శించారు. కీలక చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన పవన్ విలేకరుల సమావేశం పెట్టి పొత్తు గురించి స్పష్టమైన ప్రకటన చేశారు. తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియాలో సైతం ఈ ముగ్గురు నాయకులు మెరిసిపోయారు. అటు సోషల్ మీడియాలో సైతం అందరికీ ప్రాధాన్యత దక్కింది. కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం.. బాలకృష్ణ ఫోటో కానీ.. వార్త కానీ.. ఎక్కడా కనిపించకపోవడం విశేషం. పవన్ భువనేశ్వరి, బ్రాహ్మణి ని పరామర్శించిన సమయంలో మాత్రం.. గ్రూప్ ఫొటోలో బాలకృష్ణ కనిపించారు. అంతకుమించి బాలకృష్ణకు ఆంధ్రజ్యోతిలో కవరేజీ ఇవ్వలేదు. దీనిపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.
చంద్రబాబు అరెస్టుతోతెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. ఆ పార్టీ కష్ట కాలంలో ఉంది. ఇటువంటి సమయంలో ఎవరు మాట్లాడుతున్నా ఆంధ్రజ్యోతిలో కవరేజ్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ చిన్న పార్టీ నాయకుడైనా, రిటైర్డ్ అధికారి అయినా.. చంద్రబాబుకు అనుకూలంగా చిన్నపాటి ట్విట్ చేస్తే చాలు.. పతాక శీర్షికన వార్తలు, కథనాలు వండి మార్చుతున్నారు. అటువంటిది బాలకృష్ణ విషయంలో మాత్రం విస్మరిస్తుండడం విశేషం. అయితే బాలకృష్ణ విషయంలో ఆంధ్రజ్యోతిలో ఎప్పటి నుంచో నిషేధం నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది.ఒక విషయంలో రాధాకృష్ణకు, బాలకృష్ణకు మధ్య వివాదం నడిచినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి బాలకృష్ణ వార్తలను నిషేధించాలని రాధాకృష్ణ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.కానీ ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండగా ఆర్కే ఈగోలకు వెళ్ళడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు నందమూరి అభిమానులు సైతం రాధాకృష్ణ తీరును తప్పుపడుతున్నారు. ప్రధానంగా ఏ పార్టీలో ఉన్నా కమ్మ సామాజిక వర్గ నాయకులకు ఆంధ్రజ్యోతిలో కవరేజ్ లభిస్తుంది. కానీ నందమూరి కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం రాధాకృష్ణ అక్కసును వెళ్లగక్కుతున్నారు. అటు హిందూపురంలో సైతం బాలకృష్ణకు టిక్కెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు ఆర్కే సలహా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ లకు ఇచ్చిన ప్రాధాన్యం బాలకృష్ణకు ఇవ్వకపోవడం పై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ గెలిస్తే తన వల్లేనని.. ఓడిపోతే మాత్రం తన సలహాలు చంద్రబాబు పాటించలేదని రాధాకృష్ణ నిత్యం చెబుతుంటారు. కానీ ఆయన తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్లలో అభ్యంతరాలు ఉన్నాయి. అయితే మీడియా చేతిలో ఉండడంతో ఆర్కే జోలికి పోవడానికి సీనియర్లు సాహసించడం లేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఎపిసోడ్ తో రాధాకృష్ణ పై ఫుల్ క్లారిటీ వస్తోంది.