TDP Janasena Alliance: టిడిపి,జనసేనల మధ్య పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో కలిసి నడుస్తామని పవన్ ప్రకటించారు. ఈ తరుణంలో పొత్తులపై రకరకాల చర్చ నడుస్తోంది. సీట్ల పంపకం, పవర్ షేరింగ్ వంటి విషయాలపై పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. జనసేనకు దాదాపు 40 నుంచి 50 సీట్లు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.దీనిపై టిడిపి కీలక నేతలు కానీ.. జనసేన నేతలు కానీ నోరు మెదపడం లేదు. పార్టీ హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యము అని ప్రకటనలు చేస్తున్నారు.
టిడిపి,జనసేనల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారం చాలా రోజుల నుంచి నడుస్తోంది. రెండు పార్టీల నాయకత్వాలు, శ్రేణులు మానసికంగా సిద్ధమయ్యాయి కూడా. తొలుత జనసేనకు 18 నుంచి 20 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. టిడిపి సోషల్ మీడియా విభాగాల సైతం దీనినే ప్రచారం చేశాయి. అటు పవన్ సైతం ఈ సీట్లకు సమ్మతించినట్లు నమ్మించాయి. అయితే ఇప్పుడు అధికారికంగా పొత్తు కుదిరినట్లు అయ్యింది. టిడిపి కష్టకాలంలో ఉంది కాబట్టి, జనసేన అవసరం ఉంది కాబట్టి.. ఆ పార్టీకి సంతృప్తిపరిచే సీట్లు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
ఇప్పుడు జనసేనకు టిడిపి అవసరం కంటే.. టిడిపికే జనసేన అవసరం ఎక్కువైంది. వారాహి యాత్రతో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఓటు శాతం కూడా పెంచుకున్నట్లు విశ్లేషణలు వెలబడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పవనాలు వీస్తాయని టిడిపి ఆశించింది. కానీ ప్రోత్సాహము లేనిదే ఎవరూ నిరసనలకు ముందుకు రావడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒకరకమైన నిరాశ అలుముకుంది. దానిని అధిగమించాలంటే పవన్ తో పొత్తు కీలకం. అందుకే టిడిపి నాయకత్వం పవన్ కు వీలైనన్ని సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తోంది.
వైసీపీ ది దూకుడు స్వభావం. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. దూకుడు స్వభావమున్న అధికార పార్టీని ఢీ కొట్టాలంటే.. అంతకంటే దూకుడుగా ఉన్న జనసేన తోనే సాధ్యమని టిడిపి భావిస్తోంది. జనసేన లేనిదే అధికార పార్టీని ఎదుర్కోలేమని ఒక నిర్ణయానికి వచ్చింది. జనసేన అడిగినన్ని సీట్లు ఇచ్చి.. సంతృప్తి పరచగలిగితే జనసైనికుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని టిడిపి ఒక అంచనాకు వచ్చింది. అందుకే 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు జనసేనకు ఇచ్చేందుకు.. టిడిపి మానసికంగా సిద్ధమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.