
Harish Rao vs Jagan : జగన్ ను చంద్రబాబు విమర్శించాడు అంటే ఒక అర్థం ఉంటుంది..పోనీ పవన్ కళ్యాణ్ విమర్శించాడు అంటే ఒక అర్థం ఉంటుంది. పోనీ పొలిటికల్ లిబర్టీ తీసుకుని కేసీఆర్ విమర్శించాడు అంటే అందులో కొంత అర్థం ఉంది.. కానీ హరీష్ రావు విమర్శించాడు అంటే? దాన్ని ఏమనుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
కొద్దిరోజులుగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వైఎస్ జగన్ మీద విరుచుకుపడుతున్నాడు. ఆయన పాలన మీద విమర్శలు చేస్తున్నాడు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ లోని భవన నిర్మాణ కార్మికులు ప్రస్తుతం తెలంగాణకు వచ్చారని, వారంతా తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసుకొని తెలంగాణలో దరఖాస్తు చేసుకోవాలని హరీష్ సూచించారు. హరీష్ అన్న మాటల్లోనూ అర్థం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. కొత్త ప్రాజెక్టులు అక్కడ నిర్మితం కావడం లేదు. పైగా రాజధాని ఎక్కడ ఉంటుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ప్రభుత్వ పరంగా మౌలిక వసతులు పెంచే ప్రాజెక్టులు అక్కడ నిర్మాణంలో లేవు. దీంతో నిర్మాణరంగ కార్మికులకు అక్కడ ఉపాధి లభించడం లేదు. వారంతా పొట్ట చేత పట్టుకొని తెలంగాణకు వస్తున్నారు.. నాలుగు సంవత్సరాలుగా సుమారు 50 వేల మంది వరకు భవన నిర్మాణ కార్మికులు తెలంగాణకు వలస వచ్చారని తెలుస్తోంది. వీరంతా కూడా ఇక్కడి నిర్మాణరంగంలో తల మునకలై ఉన్నారు.
ఇక గత కొద్దిరోజులుగా తెలంగాణ స్థిరాస్థిరంగంలో ఊహించని వృద్ధి ఏర్పడుతోంది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనివిని ఎరుగని స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. కేవలం ఆంధ్ర కార్మికులు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా తెలంగాణలో పనిచేస్తున్నారు.. దీంతో కార్మికులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నాలుగు సంవత్సరాల క్రితం ఔటర్ రింగ్ లోపలే ఇళ్ల నిర్మాణం జరిగేది. కానీ ఇప్పుడు అవుటర్ కు 10 కిలోమీటర్ల వరకూ ఇళ్ళ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్మికులను తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని హరీష్ రావు పిలుపునిస్తున్నారు.
హరీష్ రావు గతంలో కూడా జగన్ మోహన్ రెడ్డి పాలన పై విమర్శలు చేశారు. రెండు వేల కోట్ల అప్పు కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏపీలో పరిస్థితి మొత్తం మారిపోయిందని, అక్కడ ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అయితే గతంలో కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగోలేవని వ్యాఖ్యలు చేసినందుకు చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలను వేరే విధంగా అర్థం చేసుకున్నారని సంజాయిషి ఇవ్వాల్సి వచ్చింది. అయితే హరీష్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హరీష్ రావు పై ఫైర్ అయ్యారు. కెసిఆర్ ఇంట్లో ఏవో కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఆ అసహనంలో ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. అంతే కానీ ఏపీ లో స్థిరాస్థిరంగం దిగజారి పోతోందని మాత్రం సజ్జల ఒప్పుకోవడం లేదు.