Jagan- Pawan Kalyan: రాజకీయాల్లో దుందుడుకు చర్యలు మంచిది కాదు. అవి ఒక్కోసారి మనకే తిప్పికొడతాయి. మనం చేసే తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే అది గుర్తించకుండా ఏపీ సీఎం జగన్ తప్పు మీద తప్పులు చేస్తున్నారు. పాలించడానికి ఏమీ లేదన్నట్టు ఆయన రాజకీయ తంత్రంతోనే పబ్బం గడుపుతున్నారు. అప్పులు చేయడం ప్రజలకు పంచడం.. ఆపై వ్యవస్థలను ధ్వంసం చేయడం..అస్మదీయులకు అందలం.. గత మూడున్నరేళ్లుగా ఇదే పంథా. నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నట్టు వ్యవహరించడం లేదు. ఈ సమాజం నన్ను ఒక నిందితుడిగా చూసింది. కేసులు పెట్టింది. జైలుపాలు చేసింది. నా రివేంజ్ ను కాసుకోండి అన్నట్టుంది జగన్ వ్యవహార శైలి. నేల విడిచి సాము చేస్తున్న ఆయన నుంచి అధికారం చేజారితే మాత్రం పరిస్థితి ఏమిటన్నది అర్ధం కావడం లేదు. విపక్ష నేతలను తిరిగనివ్వరు.. మాట్లాడనివ్వరు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే కేసు, నిరసన తెలుపుతామంటే నిర్బంధం.. ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నది ఇదే.

అయితే ఇప్పటివరకూ టీడీపీ విషయంలో సీఎం స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది. కానీ ఇప్పుడు పవన్ జోలికి వస్తున్నారు. అది ఆయనకే ఎదురుతిరుగుతుందని గుర్తించలేకపోతున్నారు. ఎందుంటే టీడీపీ నేతలు పవర్ అనుభవించారు. వ్యాపారాలు చేసుకున్నారు. లోపయికారీ తతంగాలు జరిపారు. వారిని టార్గెట్ చేసుకుంటే గతంలో ఇంత కాకపోయినా.. కొంతవరకూ వీరు రాజకీయాలు చేశారు కదా అని ప్రజలు లైట్ తీసుకున్నారు. కానీ పవన్ విషయంలో మాత్రం అలా ఆలోచించడానికి లేదు. రాజకీయాల్లో ప్లెయిన్ ఇమేజ్ తో ఉన్నారు. పైగా తాను సినిమాల్లో సంపాదించిన డబ్బును ప్రజలకు ఖర్చు చేస్తున్నారు. అందుకే అవినీతి మరక చూపో.. లేకుంటే గతంలో అవకతవకలు చేశారనో కేసులు నమోదుచేశామంటే కుదిరే పని కాదు. అందుకే ప్యాకేజీ నాయకుడు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని మాత్రమే ఆరోపించగలుగుతున్నారు. అదే పనిగా విమర్శలు చేస్తుండడంతో అందులో వాస్తవం లేదని కూడా ప్రజలు గ్రహిస్తున్నారు.
పంతానికి పోతున్న జగన్ పవన్ ను తక్కువ అంచనా వేస్తున్నారు. నాయకత్వం అంటే నాదీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ పంతాన్ని పక్కన పెడదాం. ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళదాం. 2010కి ముందు జగన్ ఒక చిన్నపాటి పారిశ్రామిక వేత్త మాత్రమే. తండ్రి రాజకీయాన్ని అడ్డంపెట్టుకొని కడప ఎంపీ అయిపోయారు. క్విడ్ ప్రోకు పాల్పడి ఎన్నో పరిశ్రమలను నెలకొల్పారు. అదే ఒరవడితో సాక్షి మీడియాను ఏర్పాటుచేశారు. సరిగ్గా అటువంటి సమయంలోనే తండ్రి అకాల మరణం పొందారు. ప్రజల నుంచి వచ్చిన అంతులేని సానుభూతిని సందర్భం చేసుకొని తాను సీఎం కావాలని భావించారు. దానికి కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చి.. తాను సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. తొలిసారిగా విపక్షానికే పరిమితమయ్యారు. తరువాత ప్రయత్నంలో సీఎం అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను గమనిస్తే ఆయన పంతం అనే స్ట్రాటజీతోనే రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ కాలం రాజకీయంగా సేవలందించలేదు. జాతి, కోసం మతం కోసం ఉద్యమించలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

అయితే పంతం అనేది ఎల్లకాలం మనలేదు. ఇప్పుడు పవన్ నాయకత్వాన్ని హేళన చేస్తున్నారు. ఆయనా ఒక నాయకుడేనా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ ను మిస్సవుతున్నారు. పార్టీ స్థాపించిన ఎనిమిదేళ్ల తరువాత ఎన్నో రాజకీయ తంత్రాలు నెరిపి జగన్ సీఎం అయ్యారు. అయితే ఆ అర్హత ఇంకొకరికి లేదంటే దానిని అమాయకత్వమే అనుకోవాలి. ఇప్పుడు పవన్ ను తొక్కేయ్యాలని పంతం పట్టారు. కానీ పవన్ దానిని తంత్రంగా చేసుకొని తిప్పికొడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి బయటపెడుతున్నారు. పవన్ పై కోపంతో ప్రజావాణిని అడ్డుకోవచ్చు. ఇప్పటంలో ప్రజల ఇళ్లను కూల్చేయ్యవచ్చు. కానీ వైసీపీని కూల్చే అస్త్రాలను పవన్ చేతికి తానే ఇస్తున్నాన్న సంగతి జగన్ మరిచిపోతున్నారు. తనను టచ్ చేయ్యొద్దని పవన్ చెప్పినా పెడచెవిన పెట్టారు. టచ్ చేసి పొలిటికల్ స్ట్రగుల్స్ ఏరికోరి తెచ్చుకున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ కొట్టాలన్ని తంత్రంతో పవన్ పనిచేయడం మొదలు పెట్టారు.