Homeఆంధ్రప్రదేశ్‌CM Ramesh: సీఎం రమేష్ కోసం చంద్రబాబుకు ఎందుకు అంత ఆరాటం?

CM Ramesh: సీఎం రమేష్ కోసం చంద్రబాబుకు ఎందుకు అంత ఆరాటం?

CM Ramesh: బిజెపిలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన రగడకు కారణమవుతోంది. ఎక్కడో కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ను అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం ఏమిటి అన్న ప్రశ్న పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇక్కడ పోటీ చేయడానికి అర్హులు లేరా? వారికి అర్హత లేదా? బిజెపి అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తున్నారా? లేకుంటే బీజేపీ హై కమాండ్ నిర్ణయం తీసుకుందా? అంటూ రకరకాల అనుమానాలను బిజెపి శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. అటు పార్టీలో సైతం ఒక రకమైన అసంతృప్తి పెరుగుతోంది. ఇది ముమ్మాటికి చంద్రబాబు మార్కు జాబితా అని తేలుతోంది.

అనకాపల్లి టిక్కెట్ ను సీఎం రమేష్ కు కేటాయించారు. ఆయన కడప జిల్లాకు చెందిన నేత. బీసీ వర్గమే అయినా.. విశాఖ జిల్లాలో బీసీలు లేరా? బీసీ నేతలు లేరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ను తొక్కి పెట్టేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన అనకాపల్లి ఎంపీ స్థానానికి సరిపోతారు. పైగా వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో వెలమలు అధికం. కనీసం ఈ సమీకరణను సైతం లెక్కలోకి తీసుకోలేదు. చంద్రబాబు, టిడిపి ప్రయోజనాల కోసం పరితపించే సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు ఇవ్వడం విశేషం. వాస్తవానికి పివిఎన్ మాధవ్ కుటుంబం బిజెపిలోనే సీనియర్. ఆయన తండ్రి పివీ చలపతిరావు ఏపీ బీజేపీ తొలి అధ్యక్షుడు కూడా. అయినా మాధవ్ సీనియారిటీని, సామాజిక వర్గాన్ని బిజెపి ప్రాధాన్యత ఇవ్వలేదు.

విజయనగరం ఎంపీ సీటును బిజెపికి కేటాయిస్తారని ప్రచారం జరిగింది.అక్కడ నుంచి పివిఎన్ మాధవ్ పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. బిజెపి అగ్ర నాయకత్వం సైతం ఆయన పేరును పరిశీలించింది. కానీ అనూహ్యంగా విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని తప్పించారు. బిజెపికి రాజంపేట సీటును కట్టబెట్టారు. దీంతో విజయనగరం ఆశలు కూడా పివిఎన్ మాధవ్ కు లేకుండా పోయాయి. వాస్తవానికి మాధవ్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తే గెలుపు పక్కా అన్న విశ్లేషణలు ఉన్నాయి. అనకాపల్లిలో స్థానిక అంశానికి ప్రజలు ప్రాధాన్యమిస్తారు. తొలుత జనసేనకు ఈ స్థానాన్ని కేటాయించారు. ఇక్కడ నుంచి నాగబాబు పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఆయన కూడా ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని 15 రోజులు పాటు పర్యటనలు కొనసాగించారు. కానీ ఇక్కడ లోకల్ ఫీలింగ్స్ అధికమని భావించి జనసేన ఈ సీటు నుంచి తప్పుకుంది. పొత్తులో భాగంగా టిడిపి ఈ స్థానాన్ని బిజెపికి విడిచిపెట్టింది. అయితే స్థానిక బిజెపి నేతలను కాదని కడపకు చెందిన సీఎం రమేష్ పోటీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కోసమే బిజెపి హై కమాండ్ స్థానిక నేతలను పక్కన పెట్టింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version