KCR National Politics: బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇవాళ ప్రారంభిస్తున్నారు. నిజానికి ఏ ప్రారంభోత్సవం అయినా కేసీఆర్ నిర్వహించే స్టయిల్ అలాగ్ ఉంటది. అదే పొలిటికల్ అయితే ఆయన హంగామా గురించి చెప్పాల్సిన పని లేదు. ఢిల్లీలో తాత్కలిక ఆఫీసు ప్రారంభోత్సవానికి ముందు మూడు రోజులు.. తర్వాత మూడు రోజుల పాటు ప్రచారమే ప్రచారం. హైదరాబాద్ నుంచే వందల మంది ఢిల్లీ వెళ్లారు. కానీ ఇప్పుడు శాశ్వతమైన ఆఫీస్ ప్రారంభిస్తుంటే… అసలు చప్పుడే లేదు. కేసీఆర్ కూడా తప్పనిసరిగా వెళ్లాలన్నట్లు గురువారం ఉదయం వెళ్తున్నారు.
చురుగ్గా పడని అడుగులు..
కేసీఆర్ రెండు రోజుల ముందుగా ఢిల్లీ వెళ్లి… ఏర్పాట్లను చూస్తారని.. జాతీయ మీడియాతో మాట్లాడుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన చివరికి ప్రారంభోత్సవం రోజు వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వతా కేసీఆర్ అడుగులు మాత్రం జాతీయ రాజకీయాల వైపు చురుగ్గా పడటం లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టడం లేదు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు కోసం సభలు పెట్టాలనుకున్నారు. కానీ అసలు ఆయా రాష్ట్రాల నుంచి ఒక్క నేతను కూడా పార్టీలో చేర్చుకోలేదు.
మహారాష్ట్ర పైనే దృష్టి..
ఇటీవలి కాలంలో అసలు ఒక్క మహారాష్ట్ర తప్ప మరో రాష్ట్రంలో పార్టీ విస్తరణ గురించి కేసీఆర్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. చివరికి పొరుగున ఉన్న కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూంటే అసలు పట్టించుకోలేదు. జేడీఎస్ తో కలిసి పని చేస్తామని ఘనమైన ప్రకటనలు చేశారు కానీ.. చేతల్లోకి వచ్చే సరికి సైలెంట్ గా ఉండిపోయారు. కారణం ఏమిటో కానీ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కన్నా మహారాష్ట్ర సరిహద్దులపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడా వర్కవుట్ అయ్యే సూచనలు కనిపించడం లేదని సైలెంట్ అయ్యారని.. ప్రారంభించారు కాబట్టి.. ఏదో అలా రాజకీయం చేయాల్సిందేనన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఎందుకలా..
కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఎందుకు ఆసక్తి తగ్గింది అన్న చర్చ జరుగుతుంది. ఒకవైపు కూతురు లిక్కర్ స్కాంప్ మరోవైపు కొడుకు ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం.. కర్ణాటక ఎన్నిక తర్వాత బిజెపి తెలంగాణపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండడం కేసీఆర్ను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జాతీయ పార్టీ కార్యాలయానికి కూడా మొక్కుబడిగా ప్రారంభోత్సవం చేస్తున్నారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో గులాబీ బాస్కు అంత చిక్కడం లేదని సమాచారం.