Vizag Steel Plant : ఒక్కరోజులోనే విశాఖ స్టీల్ పై కేంద్రం నిర్ణయం ఎందుకు మారింది? ఎందుకు అమ్మకానికి పెట్టింది?

  Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. గురువారం విశాఖలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. ఈ మాట చెప్పి 24 గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం మళ్లీ మనసు మార్చుకుంది. ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఒక్క రోజు వ్యవధిలో రెండు […]

Written By: NARESH, Updated On : April 14, 2023 9:57 pm
Follow us on

 

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. గురువారం విశాఖలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. ఈ మాట చెప్పి 24 గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం మళ్లీ మనసు మార్చుకుంది. ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఒక్క రోజు వ్యవధిలో రెండు విభిన్నమైన ప్రకటనలు ఎందుకు అంటూ కార్మిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని సుమారు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు పరిశ్రమలో పనిచేసే, కార్మికులు, కార్మిక సంఘాలు, నిర్వాసిత కుటుంబాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘ నాయకులు ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, విపక్షాల నాయకులను కలిసి ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని కోరుతూ వస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు.

కేంద్ర సహాయ మంత్రి ప్రకటనతో కార్మిక వర్గాల్లో వ్యక్తమైన ఆనందం..

విశాఖలో గురువారం పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్.. ఇక్కడ అధికారులు, కార్మిక సంఘాలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని అనుకున్నారు అంతా. కార్మిక వర్గాలు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఆనందాన్ని వ్యక్తం చేశాయి. తెలంగాణకు చెందిన సీఎం కేసీఆర్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి బిడ్ వేసేందుకు సిద్ధం కావడం, తెలంగాణ నుంచి అధికారులు బృందం ఇక్కడికి రావడం.. తదితర కారణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అంతా భావించారు. అంతా ఆనందంలో ఉన్నారన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై మరో బాంబు పేల్చే వార్తను విడుదల చేసింది.

24 గంటల్లో మనసు మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం..

ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర సహాయ మంత్రి చెప్పి 24 గంటలు గడవక ముందే.. కేంద్ర ప్రభుత్వం దీనిపై మరో ప్రకటనను విడుదల చేసింది. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తేలేదని కేంద్రం ప్రకటనలో స్పష్టం చేయడంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో మరోసారి ఆవేదన వ్యక్తమైంది. ఒక్కరోజు వెళ్తున్న రెండు భిన్నమైన ప్రకటనలకు కారణం ఏంటో అని వారంతా ఇప్పుడు తలలు గోక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేసిఆర్ కు క్రెడిట్ దక్కుతుందనే వెనక్కి..

స్టీల్ ప్లాంట్ విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉండడంతో.. తెలంగాణ సర్కార్ దీని కొనుగోలుకు సంబంధించి ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిడ్ వేయాలని నిర్ణయించింది. ఇటువంటి తరుణంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కి తగ్గితే కేసిఆర్ కు భయపడి కేంద్రం వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతోనే తాజా ప్రకటన విడుదల చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ ప్రయత్నాలు కారణంగానే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనుకడుగు వేసిందని, కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని మంత్రి కేటీఆర్, హరీష్ రావు కూడా వ్యాఖ్యానించారు. క్రెడిట్ మొత్తం వాళ్లే తీసుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే తాజా ప్రకటన చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏం చేస్తుందో తెలియక ఉద్యోగ, కార్మిక సంఘాల్లో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది.