
బీజేపీ అధిష్టానం ఆ ఇద్దరిని ఎందుకు పక్కన పెట్టినట్లు..? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ ఇద్దరు నేతలను జాతీయ కార్యవర్గం నుంచి ఎందుకు ఉద్వాసన పలికినట్లు..? భవిష్యత్తులో ఇంతకన్నా ఏమైనా ఉన్నత పదవులు వారికి దక్కనున్నాయా..? పార్టీ నుంచి మరేదైనా హామీ లభించిందా..? కేంద్ర కేబినెట్‌లో ఏమైనా అవకాశాలు లభించనున్నాయా..?
Also Read: హైదరాబాద్ రీ లోడెడ్
బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి రాంమాధవ్, మురళీధర్‌రావును అధిష్టానం తప్పించింది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చలు నడుస్తున్నాయి. వీరిని తొలగిస్తారని చాలా కాలంగా ప్రచారం నడుస్తూనే ఉంది. రాంమాధవ్‌ను కొంతకాలంగా పలు పదవుల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ఇక మురళీధర్‌రావుపై పెద్దగా ఆరోపణలు లేకన్నా ఆయన దాపరికం లేకుండా మాట్లాడతారనే విమర్శలు ఉన్నాయి. వీరితో పాటు.. నిన్నటి వరకూ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహారావును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో మంత్రులుగా అవకాశం కల్పించేందుకే కొందరు నేతలను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దగ్గుబాటి పురంధేశ్వరికి దక్కింది. ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు తెలుగువారు రాంమాధవ్, మురళీధర్‌రావులను తప్పించి.. పురందేశ్వరికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నియమించారు. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో జాతీయ స్థాయిలో మళ్లీ నలుగురు తెలుగు వారికి, అందులో ఇద్దరు మహిళలకు పార్టీలో కీలక స్థానం దక్కినట్లయింది.
Also Read: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ : ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న చైనా
ఒకవేళ కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకే వీరిని తప్పించినట్లయితే.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటివరకు కిషన్‌రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతుండగా.. కొత్త కేబినెట్ విస్తరిస్తే ఈ ఇద్దరికి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.