Congress Politics : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీకాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు పొన్నాల తన రాజీనామా లేఖను పంపించారు. జనగామ టికెట్ ఆశించిన పొన్నాల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో పొన్నాల భారీ నీటి పారుదల శాఖామంత్రిగా పనిచేశారు. తెలంగాణ తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
మాట్లాడే వారే లేకనే…
పొన్నాల రాజీనామా చేసిన క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. గాంధీ భవన్‌కు వెళ్తే కలిసేవారు లేరని.. ఫోన్‌లో మాట్లాడేందుకు యత్నిస్తే కూడా పెద్దలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు రేవంత్ సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్నారనే వస్తున్న వార్తల్ని పొన్నాల ప్రస్తావించారు.
బీసీలకు అన్యాయం..
కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం ఓ వర్గం చేస్తోందని పొన్నాల ఆరోపించారు. బీసీ నేతలను ఓడిపోయేవారిగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికి ఇస్తున్న ప్రాధాన్యత సీనియర్లకు ఇవ్వటం లేదంటూ టీపీసీసీ చీఫ్‌పై విమర్శలు చేశారు.
అవమానించారు..
తనను అవమానపర్చి హేళన చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం తనదన్నారు. 45 ఏళ్ల తర్వాత తాను తీసుకున్న నిర్ణయం బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చినట్టుగా వెల్లడించారు. కానీ, తనకు జరిగిన అవమానాలతో రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జనగామ నుంచి వరుసగా మూడు దఫాలు గెలిచిన బీసీ నేతను అని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.
కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల..
పార్టీలో తనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలియందని కాదని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖలో అన్ని విషయాలను ప్రస్తావించినట్టుగా చెప్పారు. పార్టీ పరిస్థితులను అధిష్టానానికి చెప్పేందుకు వెళ్తే వినేవాళ్లు లేరన్నారు. తనను అవమానపర్చి హేళన చేశారని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ పొన్నాల లక్ష్మయ్య కన్నీరు పెట్టుకున్నారు.
భవిష్యత్ బీఆర్‌ఎస్సేనా..
ఇక భవిష్యత్తు గురించి తాను ఆలోచించలేదని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. బీఆర్‌ఎస్ లో చేరుతున్నట్టుగా ప్రచారం సాగుతుందన్నారు. పదవుల కోసం తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదని చెప్పారు. కొద్ది మందికే పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇక భరించలేక విసుగుతో పార్టీకి రాజీనామా చేసినట్టుగా చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి ఆఫర్ రావడంతోనే పొన్నాల కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రచారం జరుగుతోంది.
వరుసగా కాంగ్రెస్‌కు గుడ్‌బై..
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్‌రెడ్డి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఆయన బీఆర్‌ఎస్ లో చేరారు. మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి కూడా ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కర్ణాటకలో జరిగిందే తెలంగాణలోనూ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌కు వరుసగా నేతలు షాక్ ఇస్తున్నారు.