CM Jagan: పొలిటికల్ సస్పెన్షన్లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. పేరుకే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు కానీ.. తర్వాత అన్ని కార్యకలాపాలు ఇట్టే జరిగిపోతాయి. అటువంటిదే నిన్న సామర్లకోటలో వెలుగు చూసింది. ఓ పెద్ద ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ ఒకరు సీఎం జగన్ వెంటే కనిపించారు. అన్నీ తానై వ్యవహరించారు. ఓ దళిత యువకుడు హత్య కేసులో ఆయన నిందితుడు. దీంతో దళితుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేశారు. కానీ అదంతా ఓటు బ్యాంకు కోసమేనని తేలిపోయింది.
ఓ దళిత యువకుడ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీ అనంత్ బాబు. ఇవే ఆరోపణలతో ఆయన జైలు జీవితం సైతం అనుభవించారు. బెయిల్ పై బయటకు వచ్చారు. అలా బెయిల్ వచ్చే క్రమంలో ఆయనకు వైసీపీ శ్రేణులు ఏ స్థాయిలో స్వాగతం చెప్పాయో అందరికీ తెలిసిందే. అదే సమయంలో దళితుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదురు కావడంతో వైసిపి నాయకత్వం ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. కానీ అదంతా ఉత్త మాటేనని తేలిపోయింది. సీఎం జగన్ రెడ్డి చుట్టూనే అనంత్ బాబు తిరుగుతున్నారు. ఆయనకు అధికార మర్యాదలు అందుతున్నాయి. సీఎం జగన్ ఉభయ గోదావరి జిల్లాలకు వస్తే చాలు.. అనంత్ బాబుకు ఇచ్చే ప్రాధాన్యం అంతా కాదు. దళిత యువకుడ్ని తానే హత్య చేశానని ఒప్పుకొని అనంత్ బాబు దర్జాగా తిరుగుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఆగిపోయింది. పోలీసులు అటువైపు చూడడమే మానేశారు.
అయితే తాజాగా జగన్ సభలో, జగన్ వెంట అనంత్ బాబు కనిపించడంతో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. దళిత వర్గాలను దగా చేయడానికి సస్పెన్షన్ వేటు వేశారని టాక్ నడుస్తోంది. అయితే వైసీపీలో ఇది కొత్త కాదు. గతంలో వంగవీటి రంగ పై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కాపులకు కోపం వస్తుందని ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ కొద్ది రోజులకే తిరిగి పార్టీలోకి తీసుకోవడమే కాక ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అనంత్ బాబు విషయంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. తప్పదు, కూడదు అని భావించి సస్పెండ్ ప్రకటన చేశారు. కానీ ఆయనకు పార్టీలో అగ్రతాంబూలం ఇస్తూ దళితులకు అడ్డంగా దగా చేశారు.