Chandrababu- KCR: ‘ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే… కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…! తండ్రి భరద్వాజుని జననమెట్టిది…?’ అంటూ దానవీరశూర కర్ణలో ఎకబిగిన డైలాగుతో ఎన్టీఆర్ ఉర్రూతలూగించారు. ఇప్పుడు రాజకీయ హీనతలు గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణుడిని తలపించే రీతిలో మాట్లాడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. దాని ఫలితం టీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తుందని సర్వే సంస్థలు హెచ్చరించడంతో కాస్తా ఖుషీగా ఉన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. కొన్నిరోజుల కిందట కేంద్ర దూతలు కొందరు తమ ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభపెట్టారో వివరించారు. పార్టీకి, తెలంగాణ సమాజానికి వీర విధేయులైన తమ ఎమ్మెల్యేలు వారిని ఎలా పట్టించారో చెబుతూ వారి నిజాయితీని కొనియాడారు. నిజంగా అటువంటి పరిస్థితే దేశ వ్యాప్తంగా వస్తే మాత్రం ప్రజాతీర్పు ఫరిడవిల్లుతుంది. ఐదేళ్ల పాటు ప్రభుత్వాలు సుస్థిరత పొందుతాయి.

కేసీఆర్ మాటలను ఒకసారి పరిశీలిస్తే… ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి..ప్రలోభపెట్టి కొనకూడదు. ఒక వేళ కొంటే మాత్రం అది ప్రజాస్వామ్యం కానేకాదు అని చెప్పుకొచ్చారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేసీఆర్ మాటలు వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అసలు సిసలు గాంధేయవాదాన్ని పుణికిపుచ్చుకున్న నేతగా చూడాల్సిన పరిస్థితి. అయితే మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహం ఏమిటన్న ప్రశ్న ఒకటి ఎదురవుతోంది. బహిరంగా ఓటరుకు డబ్బులు, బంగారం ఇచ్చిన విషయం మీడియా ప్రచురించింది. మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా పంచుడు మొదలు పెట్టాయి. కొన్ని ప్రాంతాల్లో తమకిస్తామన్న నగదు అందకపోయేసరికి ఓటు వేసేందుకు కూడా ఓటర్లు ఇష్టపడలేదని మీడియా దృశ్యాలతో సహ ప్రచారం చేసింది. అయితే దీనిపై మాత్రం కేసీఆర్ మాట్లాడ లేదు. ఎక్కడో ఫామ్ హౌస్ లో నలుగురు వ్యక్తులు తన పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభపెట్టారన్న కేసీఆర్.. తమకు ఇస్తామన్న నగదు ఇవ్వలేదని ఓటర్లు చెబుతున్నా ఎందుకు పెడచెవిన పెట్టినట్టు. పులి శాకాహారం గురించి, హిట్లర్ గాంధేయవాదం గురించి మాట్లాడుతున్నట్టు తన మాటల గారడీ చూపించి అసలు సిసలు రక్తి కట్టించారు సీఎం కేసీఆర్.
మన దగ్గరే టైమ్ మిషన్ ఉంటే.. కొద్దిరోజులు ముందుకెళితే కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గూటికి చేరారు. వారు భయంతో చేరారా? లేకుంటే భక్తితో చేరారా? అన్నది తేటతెల్లమవుతుంది. ఎవరైనా నాయకుడు పార్టీ మారినప్పుడు అప్పటివరకూ ఉన్న పార్టీపై అసంతృప్తిని, చేరుతున్న పార్టీపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వెళుతుంటారు. అప్పటి సందర్భం బట్టి మాటలు చెప్పి చేరుతుంటారు. కానీ సందర్భానుసారం మాటలు మార్చే కేసీఆర్ కు ఇది తెలియంది కాదు. కానీ ఆయన ఆదర్శ రాజకీయాలు గురించి మాట్లాడుతుండడమే చిక్కొచ్చి పడుతోంది.

ఓటుకు నోటు కేసు కేసీఆర్ కు గుర్తుండే ఉంటుంది. నాడు ఎంత యాగి చేశారో అందరికీ తెలిసిందే. ఇటువంటి ప్రలోభాలకు గురిచేసిన వారికి శిక్ష పడాలని ఇప్పుడు కేసీఆర్ చెబుతున్నారు. నాడు రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు పేరు బయటకు వచ్చినా ఎందుకు శిక్షించలేదంటే దానికి సమాధానం లేదు. నాడు చంద్రబాబు తెలంగాణలో ఉంటే తన అస్తిత్వానికి మనుగడ వస్తుందని భావించి ఓటుకునోటు కేసును సాకుగా చూపించి..భయపెట్టి మరీ చంద్రబాబును తెలంగాణ నుంచి బయటకు పంపించారు. తెలంగాణ సమాజంలో చంద్రబాబును ఒక దోషిగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అక్కడితో అది క్లోజ్. మరో కొత్త ఇష్యూతో రాజకీయం వెతుక్కున్నారు. సందర్భానుసారం తనకు మైలేజ్ ఇచ్చే రాజకీయ అంశాలను తెరపైకి తెచ్చే కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి.. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం మాత్రం దెయ్యాలు వేదాలు వల్లించినట్టవుతుంది.