Governor Tamilisai- KCR: తెలంగాణ గవర్నర్‌గా తమిళ్ సై సౌందరరాజన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో తెలంగాణ ప్రజల సేవలో అయిదో ఏడాది ఆరంభం పేరిట శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన నాలుగేళ్ల పదవీ కాలంపై కాఫీటేబుల్ బుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ‘నా బాధ్యతలు, విధులను సమర్థంగా నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా. సీఎం కేసీఆర్ అనుభవజ్ఞుడైన నేత ఆయనను చూసి ఎంతో నేర్చుకున్నా. కువిమర్శలకు, కోర్టు కేసులకు భయపడను. ప్రొటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు’ అని చెప్పారు.
కొట్లాడే ఉద్దేశం లేదు..
తనకు ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం గానీ.. కొట్లాడాలన్న ఆలోచన గానీ లేదని గవర్నర్ తెలిపారు. రాజభవనకు, ప్రగతిభవన్‌కు మధ్య ఎలాంటి సమన్వయలోపం లేదు. కేసీఆర్ ఆహ్వానం మేరకే నేను సచివాలయానికి వెళ్లా అని వివరించారు. తెలంగాణలో నేను ప్రజలను కలిస్తే రాజకీయం చేస్తున్నానని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ పుదుచ్చేరిలో ప్రతీనెల 15న ప్రజలను కలుస్తున్నా. అక్కడి అధికారులు అందుకు పూర్తిగా సహకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రాజకీయ విమర్శలను పట్టించుకోను అని అన్నారు.
గుడ్డిగా సంతకాలు చేయలేను
ఇక పెండింగ్ బిల్లుల గురించి గవర్నర్ మాట్లాడుతూ తాను తన వద్దకు వచ్చిన ఏ బిల్లుపైనా గుడ్డిగా సంతకం చేయలేనని స్పష్టం చేశారు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కొన్ని బిల్లుల్లో లోపాలు ఉన్నందునే వాటిని ప్రభుత్వం వద్దకు పంపించానని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలోనూ అనవసర రాద్ధాంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల లబ్ధికోసమే నేను కొన్ని ప్రతిపాదనలు చేశానని తెలిపారు.
ఎమ్మెల్సీల కేటరిగీపై స్పష్టత ఇవ్వలేదు..
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం ఇద్దరి పేర్లను ప్రతిపాదించిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. అయితే గవర్నర్ కోటా రాజకీయ పరమైనది కాదని.. సేవ, సాంస్కృతిక తదితర రంగాలకు నిర్దేశించిందని అన్నారు. అయితే వారు ఏ కేటగిరీలోకి వస్తారనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. దీంతో వారి నియామకాన్ని ఆమోదించలేదని తెలిపారు.
సత్సంబంధాలు ఉండాలి..
కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుండాలని, ప్రధాని వచ్చినప్పుడు సీఎం రాకపోవడం సరైంది కాదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాలల మంజూరు విషయంలోనూ కొంత వివాదం ఉందన్నారు. కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్రం నిర్ణీత గడువులోగా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ మెడికల్ హబ్‌గా పేరొందినా ఈ రంగంలో వెనకబాటు ఉందన్నారు. ఉస్మానియా ఆసుపత్రి దీనస్థితే ఇందుకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు ప్రగతిఫలాలు అందడ లేదన్నారు. వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు.
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు తగవు
రాజకీయ లబ్ధికోసం తమిళనాడుకు చెందిన కొందరు నేతలు సనాతన ధర్మాన్ని కించపరిచేలా చేస్తున్న వ్యాఖ్యలు తగవని తమిళిసై అన్నారు. ఒక వర్గంపై వివక్ష చూపొద్దని పేరొఒ్కన్నారు. జమిలి ఎన్నికలను తాను పూర్తిగా సమర్థిస్తానన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలని, దీనిపై అందరూ ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. ఈ అంశంపై కొందరు అకస్మాత్తుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
మొత్తంగా గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవలే పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. గవర్నర్‌తో అరగంటపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తర్వాత నూతన సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి గవర్నర్ వెళ్లారు. సచివాలయాన్ని సీఎం కేసీఆర్ దగ్గరుండి చూపించారు. ఈ క్రమంలో గవర్నర్ కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడడం ఇప్పుడు చర్చకు దారితీసింది.