Communists: కమ్యూనిస్టుల కథ ముగిసినట్లేనా? వారి జెండా ఏంటి? ఎజెండా ఏంటి? అనే ప్రశ్నలు వస్తే దానికి జవాబు మాత్రం శూన్యమే. ఇన్నాళ్లు ఏదో ఒక పార్టీతో అంటకాగిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం దిశా నిర్దేశం లేకుండా పోయింది. ప్రజాసమస్యలపై పోరాడేది పోయి పార్టీల కోసం పని చేస్తున్నారు. సంఘాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేంటంటే ఉద్యమం అని చెబుతున్నారు. అసలు వారు ఇంతలా బరితెగించడానికి కారణాలు ఏంటి అనే విషయంపై ఆరా తీస్తే వారికి ఏ లక్ష్యం లేదు. లేనిపోని మాటలు నూరిపోసి ఉద్యోగులను ఉద్యమం చేసే దిశగా నడిపించడమే. ఇందులో వారికి ఏదైనా ప్రయోజనం ఉందంటే అదీ కూడా లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులను ఉద్యమం చేసేందుకు ఉసిగొల్పింది కపట కమ్యూనిస్టులే. ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఏ తెలంగాణ కంటే ఒక శాతం తక్కువగా ఉంది. దానికి వారు రోడ్లెక్కి ప్రభుత్వంపై సమ్మె చేస్తామని ప్రకటించడం వారి అనైతికానికి నిదర్శనమే. పిల్లలకు ఆదర్శంగా నిలిచి భావి భారత పౌరులను తయారు చేయాల్సిన పంతుల్లే పక్కదారి పడితే ఎలా? ఎవరు బుద్ధి చెబుతారు? ఎవరు మార్గనిర్దేశం చేస్తారు. టీచర్లకు విధులపై నిబద్ధత ఉందా? ఉంటే ఇలా ఎందుకు చేస్తారు?
Also Read: Jinnah Tower In Guntur: ఏపీలోని ‘జిన్నా టవర్’ చరిత్ర తెలుసా?
కమ్యూనిస్టుల కనుసన్నల్లో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టడంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఓ కన్నేశారు. కమ్యూనిస్టుల ఆగడాలు గమనిస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయులతో ఉద్యమం చేయిస్తామని చూస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు కమ్యూనిస్టుల గురించి అంతగా పట్టించుకోకపోయినా ప్రస్తుతం వారిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రజాసమస్యలను గురించి పోరాడేదిపోయి రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులకు ఏం తక్కువైందో కమ్యూనిస్టులకే తెలియాలి.
హెచ్ఆర్ఏ విషయంలో ఉపాధ్యాయులు పట్టుబడుతున్నా అసలు వారు పల్లెల్లో ఉంటున్నారా? పట్టణాల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. దీనికి వారికి హెచ్ఆర్ఏ ఎందుకు పెంచాలి? నిజంగా వారు అద్దె ఇళ్లల్లో ఉండి చదువు చెబుతున్నారా? గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదో కుంపటి రాజేసి నిందలు భరించే బదులు చక్కగా విధులకు హాజరై ప్రభుత్వంతో సహకరించాలని సూచిస్తున్నారు.
కమ్యూనిస్టులకు ఏది సమస్యో కూడా తెలియడం లేదు. పేదల పక్షాన నిలిచి పోరాడాల్సింది పోయి టీచర్ల తరఫున వకాల్తా పుచ్చుకోవడం అంటే వారిలో నీతి ఎక్కడుందో అర్థం కావడం లేదు. ప్రజాసమస్యలను ఎంచుకుని వాటిపై ఉద్యమం చేయాల్సింది కానీ ఇలా పంతుళ్లను పక్కన పెట్టుకోవడంతో వారి ఉద్దేశం ఏమిటి? ఎందు కోసం వారితో కలుస్తున్నారో కూడా అంతుచిక్కడం లేదు.
ఏదిఏమైనా కమ్యూనిస్టులపై ఉన్న గుర్తింపును వారే తుడిచేసుకుంటున్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి ఉన్న వాడికి ఊడిగం చేసేందుకు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోది. భవిష్యత్ లో ఇలాగే చేస్తే కమ్యూనిస్టులు మొత్తానికే అంతమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి వారిలోనే మార్పు రావాలి. వారే తమ ఆశయ సాధనకు ప్రజల సమస్యలను ముందుకు తెచ్చి వాటిపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Chandrababu: చంద్రబాబు కోసం కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త.. ఏంటీ కథ
ఎవరికి లేనంత విధంగా టీచర్లకు జీతాలు వస్తున్నాయి. కానీ వారు మాకు సరిపోవడం లేదని చెప్పడం విడ్డూరమే. ఏ ఉద్యోగులకు లేనన్ని సెలవులు వీరికి ఉంటాయి. కానీ ఎంతో పని చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం. దీంతో వీరి వెనుక ఎవరున్నారు? ఎవరు వీరిని నడిపిస్తున్నారు? అనే దానిపై అందరు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంపై ఇలా నిరసన చేపట్టడంతో చదువులు సాగకపోతే విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీచర్లు పరిస్థితులను అర్థం చేసుకుని సమ్మె యోచన విరమించి విధులకు హాజరు కావాలని విశ్లేషకులు చెబుతున్నారు.