Homeఆంధ్రప్రదేశ్‌ప్రధాని ముందు కరోనా తీవ్రతను తక్కువగా చూపిన జగన్

ప్రధాని ముందు కరోనా తీవ్రతను తక్కువగా చూపిన జగన్


కరోనా ముప్పు రాగలదని స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పై ఒక వంక కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ, ఆయనను ఆర్డినెన్సు ద్వారా ఆ పదవి నుండి తొలగించిన ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోవంక రాష్ట్రంలో కరోనా తీవ్రతను తక్కువగా చూపి లాక్ డౌన్ ను సడలించేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ కొనసాగింపుపై వ్యతిరేకత తెలిపిన ఇద్దరు ముఖ్యమంత్రులలో జగన్ ఒకరు కావడం గమనార్హం. దారుణంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిష్టితి నుండి బైట పడటం కోసం లాక్ డౌన్ సడలింపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలో తీవ్రమవుతున్న కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించి చూపేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదివరలో రోజువారీ హెల్త్ బుల్లెటిన్ లలో జరిపిన కరోనా పరీక్షల వివరాలు, స్వీయ నిర్బంధంలో ఉంచిన వారి వివరాలు, ఆసుపతుర్లలో ఉన్న వారి వివరాలు ప్రతిరోజూ ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను మాత్రమే ఇస్తున్నారు. విజయవాడలో దంపతులు మృతి చెందితే మూడు రోజుల తరవాత బైటకు పొక్కడంతో ఒక్కరి మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించడం గమనార్హం.

అట్లాగే శనివారం సాయంత్రంకు సగంకు పైగా జిల్లాలో, 7 జిల్లాల్లో 20 కి పైగా పాజిటివ్ కేసులు ఉంటె, ప్రధానికి మాత్రం రెండు అని మాత్రమే చెప్పారు. కరోనా వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్‌ 405 కేసులతో దేశంలో 8వ స్థానంలో ఉండగా, సమస్య తీవ్రతను తగ్గించి చూపేందుకు విఫల ప్రయత్నం చేసారు.

మార్చి 20వ తేదీ నాటికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే, అదీ పదికిలోపు కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం తెలిపారు. మరో 20 రోజుల్లో అంటే, శుక్రవారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాలకు వైరస్‌ పాకిందని, అందులోనూ కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే 20కిపైగా కేసులు నమోదయ్యాయని ఈ ప్రజంటేషన్‌లో జగన్ వివరించారు.

కానీ, వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే శుక్రవారమే ఏడు జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు 20కి మించి నమోదయ్యాయి. శనివారం సాయంత్రానికే ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.

చిత్తూరు, విశాఖల్లో సరిగ్గా 20 కేసులు ఉండటంతో ‘రెడ్‌ జోన్‌’లో పడలేదు. మరొక్క కేసు అదనంగా నమోదైనా అవీ రెడ్‌లో పడేవి. అనంతపురం జిల్లాలో కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ… ఒక మరణం చోటు చేసుకుంది.

శనివారం మధ్యాహ్నం వరకు మీడియా బులెటిన్‌ ఇవ్వకుండా పాత అంకెలతోనే నడిపించారు. ఆ తర్వాత బులెటిన్‌ విడుదల చేశారు. దీనిప్రకారం చూసినా 7 జిల్లాల్లో 20కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నంలో సరిగ్గా 20 కేసులు లెక్క తేలాయి. మొత్తం కేసుల సంఖ్య 400 మార్కును దాటింది.

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ కొత్తగా మండలాల లెక్క బయటికి తీశారు. ఏపీలో 676 మండలాలకుగాను 37 మండలాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయన్నారు. 44 ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని… 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదని తెలిపారు.

నిజానికి, కరోనా తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ జిల్లాల వారీగానే లెక్కలు విడుదల చేస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular