
ఇప్పుడు చైనా స్థాయి ఏంటన్నది ప్రపంచం మొత్తానికీ తెలిసిందే. 2010లో జపాన్ ను వెనక్కు నెట్టి, అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిన చైనా.. అదే దూకుడు కొనసాగిస్తూ బలీయమైన శక్తిగా ఎదిగింది. ఇంకా ఎదుగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ నేల చూపులు చూస్తే.. చైనా మాత్రం రెండంకెల వృద్ధిరేటు సాధించి.. మరింత పైకి ఎగబాకింది. ఇలాంటి చైనాకు అధినేతగా ఉన్నారు జిన్ పింగ్. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధినేత ఏం చేసినా.. అంతర్జాతీయంగా అది ప్రముఖమైన వార్తే అవుతోంది.
గత నెల 21న మూడు రోజుల పర్యటన నిమిత్తం టిబెట్ లో అడుగు పెట్టారు చైనా అధ్యక్షుడు. 1950వ దశకంలో చైనాలో అంతర్భాగమైన టిబెట్ ను.. భారత్ తో సహా అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. అయితే.. దలైలామా వంటి వారు టిబెట్ స్వతంత్రత గురించి మాట్లాడినప్పుడల్లా అదొక వార్త అవుతుంది. ఆ తర్వాత మళ్లీ షరామామూలే అవుతోంది. అయితే.. తమపై చైనా సంస్కృతిని బలంగా రుద్దుతున్నారనే అభిప్రాయం మెజారిటీ టిబెటన్లలో ఉంది. చైనీస్ అధికార భాష ‘మాండరిస్’ను నేర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఆర్మీలో చేరాలనే ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఈ విధంగా.. చైనా ఏలుబడిలో తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామనే భావనలో ఉన్నారు టిబెటన్లు. దశాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది.
ఇదిలాఉంటే.. చైనా-భారత్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల గురించి కూడా అందరికీ తెలిసిందే. గతేడాది జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోవడం.. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో టిబెట్ లో పర్యటించారు జిన్ పింగ్. దీంతో.. అంతర్జాతీయంగా చైనా అధినేత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. టిబెట్ లోని నియింగ్చి విమానాశ్రయంలో దిగారు జిన్ పింగ్. ఈ ప్రాంతం మన అరుణాచల్ ప్రదేశ్ కు కేవలం 20కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా యార్లుంగ్ జాంగోబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం కొత్తగా నిర్మించిన సిచువాన్-లాసా రైల్వే లైన్ ను సందర్శించారు.
అయితే.. చైనా అధ్యక్షుడు ఎందుకు టిబెట్ ను ఇప్పుడు సందర్శించారనే ప్రశ్న మొదలైంది. 1991 తర్వాత టిబెట్ లో పర్యటించిన తొలి అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రమే. మరి, ఇప్పుడు మూడు రోజులపాటు ఈ ప్రాంతంలో పర్యటించడంలో ఎజెండా ఏంటనే చర్చ వచ్చింది. భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చారా? అనేది కూడా మన దళాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే.. మరోవైపు మాత్రం టిబెటన్లలో ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు, అంతా ఒక్కటే అనే భావన వారిలో కల్పించేందుకే వచ్చారనే చర్చ సాగుతోంది. వాస్తవం ఏంటన్నది భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.