Pattadar Passbook AP- Nadendla Manohar: ప్రభుత్వంలో ప్రజలూ ఒక భాగం. వారు ఓటు ద్వారా ఐదేళ్ల పాటు పాలించమని అవకాశమిస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు చాన్సిస్తారు. అయితే ప్రజలకే కాదు.. ప్రజల ఆస్తులకు కూడా మేమే రెస్పాన్సిబిలిటీ అని జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. ఆ భూములు తమవేనని భావిస్తున్నట్టుంది. భూ పత్రాలపై అసలైన హక్కుదారుడైన రైతు కంటే సీఎం జగన్ ఫొటొ ఇప్పుడు కనిపిస్తుండడంతో.. ఆ భూమి తమదా? లేకుంటే ప్రభుత్వానిదా? అన్న అనుమానం సగటు రైతుల నుంచి వినిపిస్తోంది. చాలా మంది నిరక్షరాస్యులైన రైతులు తాటికాయ అంత రీతిలో ఉన్న జగన్ ఫొటోను చూసి బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఆ భూమి తమదా? కాదా? అన్నఅనుమానం వారిని వెంటాడుతోంది. చాలా మంది అధికారుల వద్ద ఆరాతీయడం కూడా కనిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వం భూ రీసర్వే చేసి రైతులకు శాశ్వత భూ హక్కు పథకం కింద జారీ చేసి పట్టాదారు పాసు పుస్తకాలను జారీచేసింది. అయితే ఈ పుస్తకాలు రూపొందించడంలో ప్రభుత్వ ప్రచార ఆర్భాటం రైతులకు ఇబ్బందికరంగా మారింది.

అయితే భూముల రీ సర్వే నిర్వహిస్తన్న వైసీపీ ప్రభుత్వం సాహసం అభినందించాల్సిందే. కానీ ఈ ప్రక్రియలో కూడా రాజకీయం చేస్తున్నతీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూలో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు అన్ని ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. కానీ అందుకు తగ్గట్టుగా ముందస్తుగా వర్కవుట్ చేయలేదు. కేవలం రాజకీయపరంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలియడం కలవరపరుస్తోంది. దశాబ్దాలుగా రైతుల ఆధీనంలో ఉన్న వివిధ రకాల ప్రభుత్వ భూమిని తన గుప్పెట్లో తెచ్చుకునే పన్నాగంలో భాగమే ఇదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది రైతులకు ప్రయోజనం కల్పించే ప్రక్రియ కానే కాదని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అయాచిత లబ్ధి కోసం చేస్తున్న సర్వే అంటూ విపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

భూముల రీ సర్వే అనేది జఠిలమైన సమస్య. దానికి ముందుగా అధ్యయనం చేయాలి. అటు భూ సర్వేపై అవగాహన ఉన్న అధికారులు, సిబ్బందిని నియమించాలి. కానీ అటువంటిదేమీ లేదు. ల్యాండ్ సర్వేలో అనుభవం లేని వారిని ప్రక్రియకు వినియోగిస్తుండడం మొదటికే మోసం వస్తోంది. అత్తెసరు శిక్షణతో సచివాలయాల్లోల్యాండ్ సర్వేయర్లను నియమించారు. ఈ సర్వే భారన్నంతటినీ వారిపైనే వదిలేశారు. రెవెన్యూ, సర్వే ఆఫ్ ల్యాండ్ శాఖలు సంయుక్తంగా చేపట్టాల్సిన ఈ ఆపరేషన్ ఏ అనుభవం లేని సచివాలయ సర్వేయర్లకు కత్తిమీద సాములా మారింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రయోగాత్మకంగా మండలాల్లో ఒకటి రెండు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఇప్పటికి అది కొలిక్కి వచ్చింది. సర్వే పూర్తిచేసిన వారికి శాశ్వత భూ హక్కు పత్రాలు అందించలేదు. ఇప్పుడు అందిస్తున్న పాసు పుస్తకాలపై రైతుల ఫొటోతో వివరాలు చిన్నవిగాను.. సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పథకాలను పెద్దవిగాను ముద్రించారు. ఇది ముమ్మాటికీ రైతులకు అన్యాయం చేయడమేనని జనసేన నేత నాదేండ్ల మనోహర్ అన్నారు. తక్షణం సీఎంతో పాటు ప్రభుత్వ పథకాలను తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రచార కాంక్ష పరాకాష్టకు చేరిందని..గతంలో ఏ ప్రభుత్వమూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు.