Homeజాతీయ వార్తలుAddanki Dayakar: అద్దంకి దయాకర్ కు అన్యాయం చేసింది ఎవరు?

Addanki Dayakar: అద్దంకి దయాకర్ కు అన్యాయం చేసింది ఎవరు?

Addanki Dayakar: మీరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారంటూ గత మంగళవారం అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. కానీ బుధవారం మధ్యాహ్నానికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అద్దంకి దయాకర్ స్థానంలో ఒక్కసారిగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు చేరిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అని అద్దంకి దయాకర్ ఆలోచిస్తుండగానే జరగాల్సింది జరిగిపోయింది. వాస్తవానికి ఎన్ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అసలు ఈ పరిణామాలతో ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అంతేకాదు ఇక్కడ నేతలు తీసుకునే నిర్ణయాలకు అధిష్టానం వద్ద విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో తగిన మెజారిటీ కలిగి ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలపై తీవ్రమైన కసరత్తు చేసింది. అయితే అప్పటిదాకా కేవలం అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వినిపించింది. ఇక మిగతా ఎమ్మెల్సీకి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది బయటకు పొక్కకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లే ముందు ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. అప్పుడు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి అధిష్టానం కూడా పచ్చ జెండా ఊపిందని ముఖ్యమంత్రి మీడియాకు లీకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వారి వారి సామాజిక వర్గాల చెందినవారు దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ కు అభినందనలు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఢిల్లీలో సీన్ మారిపోయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంతో మహేష్ కుమార్ గౌడ్ స్థానంలో ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు చేరిందని పార్టీ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. ఈ క్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ మంగళవారం అద్దంకి దయాకర్ కు, బల్మూరి వెంకట్ కు ఫోన్ చేశారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో ఒక్కో అభ్యర్థిని పదిమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్థానం అప్పగించింది. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి ఆ ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు. వారితో సంతకాలు కూడా చేయించారు. ఇక గురువారం నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. అయితే ఇంతలోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు గల్లంతయింది. ఆయనకు బదులు మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరింది. అయితే ఈ వివరాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అద్దంకి దయాకర్ కు.. ఆయనకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు దెబ్బకు సైలెంట్ అయిపోయాయి.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓ మంత్రి అద్దంకి దయాకర్ కు అడ్డు పడ్డారని ప్రచారం జరుగుతున్నది. 2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన దయాకర్ ను సొంత పార్టీ నేతలు ఓడించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని దయాకర్ పలుమార్లు ప్రకటించారు కూడా. అయితే అప్పట్లో ఆయన సభా వేదిక ముందు ఓ నాయకుడిని దూషించారు. దీనిని మనసులో పెట్టుకున్న ఆ నాయకుడు గత ఎన్నికల్లో దయాకర్ కు టికెట్ రాకుండా చేశారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ దక్కుతుందని అందరూ భావించారు. రేవంత్ రెడ్డి కి అనుకూలమైన వ్యక్తిగా దయాకర్ ముద్రపడ్డారు. దయాకర్ కు ఎమ్మెల్సీ స్థానాన్ని దూరం చేయడం పట్ల ఆ కీలక నాయకుడి హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తనకు ఎమ్మెల్సీ దూరమైనంత మాత్రాన కేడర్ బాధపడాల్సిన అవసరం లేదని అద్దంకి దయాకర్ చెప్పడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular