
తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30తో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో.. ఇప్పటి వరకూ ఉన్న నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరిపోయింది. పార్టీలన్నీ పోరుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ-.జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుఉకు వైసీపీ ప్రయత్నం చేస్తుండగా.. గెలుపు జెండా ఎగరేసేందుకు విపక్షాలు కృషి చేస్తున్నాయి. మరి, చరిత్ర ఏం చెబుతోంది? ఇక్కడ ఎవరి బలం ఎంత? అనేది చూద్దాం.
Also Read: వ్యూహాత్మకం.. ఆకర్షణ మంత్రం.. జగన్ పాలి’ట్రిక్స్’
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ తరపున బరిలో దిగిన బల్లి దుర్గా ప్రసాద్ రెండు లక్షల 28వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దుర్గాప్రసాద్ కు 7,22,877 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,94,501 ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాతి స్థానం నోటాకు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం. కాగా.. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను మొత్తం వైసీపీనే గెలుచుకోవడం విశేషం. దీంతో.. మరోసారి విజయం తమదేనని ఆ పార్టీ చెబుతోంది.
ఈ నియోజకవర్గంలో టీడీపీ ట్రాక్ రికార్డును గమనిస్తే.. మరీ పేలవంగా ఉంది. ఇక్కడ ఆ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ.. ఒకే ఒక్కసారి విజయం సాధించింది. 1984లో పార్టీ ఆవిర్భం సందర్భంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చింతామోహన్ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 1989, 1991, 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1999లో మాత్రం టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి గెలిచారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించడంతో ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ఆ పార్టీ భావిస్తోంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచింది. వైసీపీ ఒకటీ రెండు చోట్ల మినహా పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీ ప్రభావం అత్యల్పంగా ఉంది. దీంతో.. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తామే నిలబెట్టుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా ప్రచారం చేస్తున్నారు.
Also Read: కాలి కట్టే మమతా ఎన్నికల అస్ర్తమా..?
టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం.. స్థానిక ఎన్నికలతో లోక్ సభ స్థానాన్ని కంపేర్ చేయడం సరికాదంటున్నారు. స్థానిక పరిస్థితులకు, ఈ ఎన్నికలకు పొంతన ఉండదని అంటున్నారు. అంతేకాదు.. అధికార పార్టీ దుర్వినియోగంతో ఎన్నికల్లో లబ్ధిపొందిందని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతామని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలో తమ బలం పెరిగిందని చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
అయితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినప్పటికీ బీజేపీ ఇవ్వలేదు. అటు సాధిస్తామన్న టీడీపీ కూడా ఐదేళ్లు గడిపేసింది. ఇప్పుడు పోరాడతామంటూ వచ్చిన వైసీపీ.. ఆ విషయంలో సాధించిన పురోగతి ఏమీ లేదు. ఇంకా.. ఆధ్యాత్మిక నగరంలో పలు సమస్యలు అలాగే ఉన్నాయి. మరి, ఈ అంశాలు ఎన్నికల్లో ఎంత మేర ఫలితం చూపనున్నాయి? ఎవరికి నష్టం కలిగిస్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 17న జరిగే పోలింగ్ లో ఓటరు ఎవరివైపు నిలుస్తారో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్