
Janasena- MLC elections: ఏపీలో ఎమ్మెల్సీ నగరా మోగింది. శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16న నోటిఫికేషన్ రానుంది. ఇందులో స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగానే జరగనున్నాయి. వైసీపీకి స్థానిక ప్రజాప్రతినిధుల బలం ఉండడంతో గెలుపు సునాయాసమే. కానీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మాత్రం ప్రతిష్ఠాత్మకం. అన్ని పార్టీలు బరిలో నిలుస్తుండడమే ఇందుకు కారణం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. ఆయనే మరోసారి బరిలో దిగనున్నారు. అధికార వైసీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను ఆరు నెలల కిందటే అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ తొలుత భీమిలి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ గాడు చిన్నకుమారి లక్ష్మిని ప్రకటించింది. అయితే అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. కాపు సామాజికవర్గానికి చెందిన వేపాడ చిరంజీవిరావు పేరును ప్రకటించింది. ఇక సీపీఐ,సీపీఎం అనుబంధ పార్టీల ఉమ్మడి అభ్యర్థి సైతం బరిలో ఉన్నారు.
అయితే ఇప్పుడు జనసేన ఏ పార్టీకి మద్దతు తెలుపుతుందన్నది ప్రశ్న. ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. కానీ కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అభ్యర్థికి మద్దతును కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ జనసేన తమ మిత్రపక్షమేనని చెప్పుకొస్తున్నారు. కానీ ఆ పార్టీ కలిసి రాకున్నా ఒంటరి పోరు సాగిస్తామే తప్ప టీడీపీతో పొత్తు పెట్టుకోమని సంకేతాలిస్తున్నారు. అదే సమయంలో విశాఖ ఎంపీ స్థానంపై మనసు పెంచుకున్న జీవీఎల్ మాత్రం జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇద్దరు కీలక నాయకులు విరుద్ధ ప్రకటనలు చేస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ప్రశ్నార్థకంగా మారింది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు తాము దూరంగా ఉన్నామని పవన్ ఇది వరకే ప్రకటించారు. తాజాగా కాపుల రిజర్వేషన్ అంశం తెరపైకి రావడం, కాపులు జనసేన వైపు కన్వర్ట్ అవుతుండడంతో టీడీపీ వ్యూహం మార్చింది. తొలుత బీసీ వర్గానికి చెందిన మహిళను క్యాండిడేట్ గా ప్రకటించినా.. ఇప్పుడు కాపు సామాజికవర్గానికి చెందిన వేపాడ చిరంజీవిరావును తెరపైకి తెచ్చింది. ఉత్తరాంధ్రలో కాపులు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. ఇదే సమయంలో కానీ జనసేన టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే విజయం సునాయాసమవుతుందని భావిస్తోంది. అదే సమయంలో పొత్తు సంకేతాలు ఇరు పార్టీ శ్రేణులకు పంపించేందుకు ఇదో మంచి అవకాశంగా భావించి పవన్ ను ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే పవన్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉండడమే మేలని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇంకా పొత్తులు కొలిక్కి రాకపోవడంతో అన్ని పార్టీలకు సమదూరం పాటించడమే శ్రేయస్కరంగా చెబుతున్నారు. ఒక వేళ టీడీపీకి కానీ మద్దతు తెలిపితే విపక్షాలకు టార్గెట్ అవుతామని.. పొత్తుల సమయంలో సీట్లు డిమాండ్ చేయలేమని అనుమానిస్తున్నారు. అలాగని బీజేపీకి సపోర్టు చేస్తే పలుచన అయిపోతామని.. విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ వంటి పాపం జనసేనకు అంటగడతారని భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా మౌనం పాటించడం ఉత్తమమని చెబుతున్నారు. లేకుంటే జనసేన అభ్యర్థిని రంగంలో దించితే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. దీనిపై జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశముందని జనసేనవర్గాలు చెబుతున్నాయి.