
Amanchi Krishna Mohan: ఏపీలో చీరాల నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. రెండు దశాబ్దాలుగా చీరాల నియోజకవర్గంలో పట్టుకొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత ఎన్నికల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తనకిష్టమైన చీరాల నియోజకవర్గాన్ని విడిచిపెట్టాల్సిన అనివార్య పరిస్థితులను జగన్ కల్పించారు. ఆయన్ను పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా పంపించారు. అయితే అయిష్టతగానే ఆయన ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. పర్చూరుకు కంటే చీరాలలో తనకు పట్టుండడంతో అక్కడే ఫోకస్ పెంచారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తున్నట్టు కనిపిస్తూనే చీరాలలో తన పని తాను చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇందుకు తన తమ్ముడు స్వాములను వినియోగించుకుంటున్నారు. ముందుగా సోదరుడ్ని జనసేనలోకి పంపి.. తరువాత తాను జంప్ కావాలని భావిస్తున్నారు. తాజాగా నియోజకవర్గం వ్యాప్తంగా స్వాములు ఫొటోలతో జనసేన ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశమైంది.
2000లో చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం జడ్పీటీసీగా అమంచి ఎన్నికయ్యారు. 2006లో అదే మండలం నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెంట నడిచారు. కానీ 2014లో ఆ పార్టీ ఆమంచికి టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగిన ఆమంచి గెలుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దీంతో చంద్రబాబు పార్టీలో సీనియర్ అయిన కరణం బలరాంకు చీరాల టిక్కెట్ ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ పై పోటీకి దింపారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం వీచినా.. చీరాలలో మాత్రం ఆమంచి ఓడిపోయారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో ఆమంచి నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది.
కరణం బలరాం ఎంట్రీ తరువాత చీరాల వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్థినని ఆమంచి, అటు బలరాం ప్రకటించడంతో పార్టీ హైకమాండ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. వచ్చే ఎన్నికల్లో సీటు కన్ఫర్మ్ అన్న హామీతో బలరాంను వైసీపీలోకి రప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడ్ని బరిలో దించాలని బలరాం భావిస్తున్నారు. దీంతో ఆమంచిని పర్చూరు పంపించాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే అక్కడకు వెళ్లేందుకు ఆమంచి తటపటాయించినా.. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఒప్పుకున్నారు. కానీ తన మనసు నుంచి చీరాల నియోజకవర్గాన్ని దూరం చేయలేకపోయారు.

వాస్తవానికి ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరతారని చాలారోజులుగా ప్రచారం జరిగింది. అప్పుడే వైసీపీ హైకమాండ్ జాగ్రత్త పడింది. ఆమంచితో పవన్ పై విమర్శలు చేయించేది. అయితే గత కొద్దిరోజులుగా పవన్ పై ఆమంచి కృష్ణమోహన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో ఇప్పుడు ఆయన సోదరుడి ఫొటోలతో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమైంది. సోదరుడు కృష్ణమోహన్ అనుమతి లేకుండా స్వాములు ఏపని చేయరు. ఇప్పుడు కూడా కృష్ణమోహన్ ఆదేశాలు, అనుమతితోనే ఆ పని చేసి ఉంటారని.. జగన్ కు సరైన సమయంలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.