AP Next CS: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం వెతుకులాడుతున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ (Adityanath Das) పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో నూతన ప్రధాన కార్యదర్శి వేటలో వైసీపీ ప్రభుత్వం పడింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న వారిలో అజయ్ సుహానీ సీనియర్ గా కొనసాగుతున్నారు. దీంతో ఆయన సతీమణి నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం రాష్ర్ట ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
2014లో రాష్ర్ట విభజన తరువాత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్ద అజయ్ సుహానీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆయన రాకుంటే 1985 బ్యాచ్ కు చెందిన శమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 1986 బ్యాచ్ కు చెందిన సతీష్ చంద్ర సైతం చంద్రబాబు వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్లు తెలుస్తోంది. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి చాలా కాలం పాటు సర్వీసులో ఉండడంతో ప్రస్తుతం ఆమెకు అవకాశం దక్కుతుందా లేదో చూడాల్సిందే.
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక కావాలనే శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి తప్పించి ఏపీకి రప్పించారు. ఇప్పటికే రెండు పదోన్నతులతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. అదే బ్యాచ్ కు చెందిన పూనం మాల కొండయ్య సైతం సీనియర్ గా ఉన్నా ఆమెకు అవకాశాలు లేనట్లే అని తెలిసిపోతోంది. పూనం మాలకొండయ్యకు ఆరోగ్య శాఖలో సేవలందించిన్పుడు ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఆమెకు చాన్స్ రావడం కష్టమే అని తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసిన జవహర్ రెడ్డిపై జగన్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో జవహర్ రెడ్డి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో కూడా ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసినట్లు తెలుస్తోంది. కొవిడ్ -19 నిర్వహణలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. కరోనా రెండో దశలో కూడా ఆయన టీటీడీ ఈవోగా ఉన్నా ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలు నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. దీంతో జగన్ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం నిర్ణయం ఏ మేరకు ఉంటుందో అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.