AP Cabinet Expansion: ఏపీ సీఎం జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఈ కేబినెట్ ను రద్దు చేసి కొత్త మంత్రులను తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులను తప్పించడం.. కొత్త మంత్రులకు అవకాశం గురించి అనేక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తన కేబినెట్ కూర్పుతో అందరికీ షాకిచ్చాడు. అగ్రవర్ణాలు, పార్టీ కోసం ఎంతో కృషి చేసిన సీనియర్లను పక్కనపెట్టి సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేశారు. ముక్కు మొహం తెలియని వారిని.. తొలి సారి గెలిచిన అనుభవం లేని వారిని కూడా వారి సామాజిక కులం ఆధారంగా మంత్రిపదవులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా వెనుకబడి ఐదు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేవారు. అందులో ఒకటి బీసీలకు ఇవ్వగా.. మరొకటి కాపు వర్గానికి కేటాయించారు.
జగన్ సీఎం అయిన తర్వాత తన కేబినెట్ లో ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఇక ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా డిప్యూటీ సీఎం పదవులు ఆరుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న వర్గాలతో పాటు అదనంగా మరో ఇద్దరికీ అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.
ఈసారి జగన్ కొత్త కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం హోదా కొనసాగనుంది. ఇక బీసీల్లో తొలుత జగన్ శెట్టి బలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయన రాజ్యసభకు వెళ్లడంతో ఆ కోటాలో ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఈసారి బీసీ వర్గాల్లో మత్స్యకార వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం.
ఈక్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మత్స్యకార వర్గం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు ఇప్పుడు మంత్రి పదవి ఖాయం అన్న ప్రచారం సాగుతోంది. ఇక వీళ్లే కాదు ఈసారి వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు సైతం డిప్యూటీ సీఎం హోదా ఇచ్చేందుకు జగన్ రెడీ అయినట్టు తెలుస్తోంది. వైశ్య సామాజికవర్గం నుంచి కొలగొట్ల వీరభద్ర స్వామి లేదా అన్నా రాంబాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బ్రాహ్మణుల కోటాలో మల్లాది విష్ణు, కోన రఘుపతిలలో ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కోన రఘుపతికి మంత్రి పదవి ఇస్తానని జగన్ గతంలో హామీ కూడా ఇచ్చారు.
ఇక సామాజిక కోణంలో జగన్ కొంతమంది మంత్రులను ఉంచి మరికొంత మందినీ తీసేస్తాననడంతో మిగిలిన వారు భగ్గుమంటున్నారు. తీసేస్తే అందరినీ తీసేసి వందశాతం కొత్త వారిని తీసుకోవాలని అంటున్నారు. పలువురు సీనియర్ మంత్రులదీ అదే మాట.. దీంతో జగన్ ఎవరిని తొలగిస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏడో తేదీన చివర కేబినెట్ మీటింగ్ పెట్టి అందరి రాజీనామా పత్రాలు తీసుకొని గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. తర్వాత కొత్త మంత్రులెవరో 10వ తేదీన వారికి సమాచారం ఇస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త పాత మంత్రులకు జగన్ విందు ఏర్పాటు చేసి కూల్ చేస్తారని..బుజ్జగించి పార్టీ కోసం పనిచేయాలని సూచిస్తారని తెలుస్తోంది. పార్టీలో అసమ్మతి సెగ రాకుండా ముందస్తుగా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దింపినట్టు సమాచారం.
ఇక 2024 ఎన్నికల లక్ష్యంగా ఈసారి సీఎం జగన్ కొత్త కేబినెట్ ఉంటుందని.. దూకుడుకు మారుపేరుగా ఉండే సీనియర్ నేతలు రోజా, ధర్మాన ప్రసాద్ రావు, అంబటి రాంబాబు ,భూమన లాంటి మరికొంత మంది ఫైర్ బ్రాండ్స్ కు జగన్ ఈసారి కేబినెట్ లో చోటు కల్పించి మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం సాగుతోంది. వీళ్లు ఉంటే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతారని.. ప్రచారంలోనూ కలిసి వస్తారని జగన్ భావిస్తున్నారు. జగన్ మార్క్ లెక్కలు, ప్రక్షాళనతో ఈసారి ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
Also Read: Chiranjeevi Comments On Taapsee: రాజకీయాల కంటే హీరోయిన్లు ఎక్కువయ్యారా చిరు.. ఏంటీ కామెంట్లు..?