https://oktelugu.com/

America : భారత్‌కు సాయం ఇవ్వనన్న అమెరికా.. మధ్యలో ఎవరీ వీణారెడ్డి ?

America : భారత్‌లో ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అంటూ బైడెన్ గవర్నమెంట్ 21 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.180 కోట్లు కేటాయించింది.

Written By: , Updated On : February 22, 2025 / 04:23 PM IST
Veena Reddy

Veena Reddy

Follow us on

America : భారత్‌లో ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అంటూ బైడెన్ గవర్నమెంట్ 21 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.180 కోట్లు కేటాయించింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఏఐడీ) కింద ప్రతీ సారి ఎన్నికలు జరిగినప్పుడు ఈ నగదు ఇస్తూ ఉంటారు. అయితే ఈ సాయాన్ని ఈ సారి మేము ఎందుకు ఇవ్వాలని భారత్ దగ్గర బోలెడు డబ్బు ఉందని చెప్పి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. అయితే అసలు ఈ డబ్బులతో ఇండియాలో ఏం చేశారన్నది రకరకాల చర్చలను దారి తీస్తోంది. ఇప్పుడు అది మోడీని ఓడించడానికి బైడెన్ ప్రభుత్వం చేసిన పనిగా గుర్తించారు. భారత్ లో ఎవరినో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం చేసిందని ఆయన అంటున్నారు.

ఇపుడు ఇదే అంశం అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు యూఎస్ఏఐడీ అందజేసే సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగం (డోజ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సాయం నిలివేతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్ధించారు. అంతేకాదు, భారత ఎన్నికల్లో జో బైడెన్ జోక్యం చేసుకున్నారని ఆయన పరోక్షంగా ఆరోపించడం సంచలనంగా మారింది.

డబ్బులను కేటాయించడంతో పాటు యూఎస్ ఎయిడ్ తరపున ఎన్నికల్లో పని చేసేందుకు వీణా రెడ్డి అనే మహిళను బైడెన్ గవర్నమెంట్ ఇండియాకు పంపింది. ఇక్కడ ఆమె ఎన్నికల టైంలో చురుగ్గా వ్యవహరించారు. 2021లో భారత్‌కు వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారని అధికార బీజేపీకి చెందిన ఎంపీ మహేశ్ జఠ్మలానీ ఆరోపించారు. ఆ సమయంలో వీణా రెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ ‌లో పోస్ట్ పెట్టారు. దీంతో వీణారెడ్డి పేరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

వీణారెడ్డి భారతీయ అమెరికన్.. యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏఐడీ) ఇండియా-భూటాన్ మిషన్‌కు ఆమె 2021-24 సమయంలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా సాయం చేయడంలో తాను కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు ట్రంప్ ఆరోపించారని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఎంపీ జఠ్మలానీ కోరారు.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. 2012లో ఎన్నికల కమిషన్, యూఎస్ఏఐడీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది ఓటింగ్ పెంచడానికి అని చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం ఏదో కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు వీణారెడ్డి దేశంలో ఉన్న సమయంలో ఏం చేసిందో దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఈ కారణంగానే చేస్తోంది. వీణారెడ్డి ని యూఎస్ ఎయిడ్ కోసం నియమించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది .