Bhadrachalam Flooded Villages: గోదావరి ఉరకలెత్తుతోంది. కనీవిని ఎరుగని స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి ములుగు దాకా లోటట్టు ప్రాంతాలను అన్నింటిని ముంచేసింది. ఇప్పటికీ వారం గడిచినా వరద తీవ్రత తగ్గలేదు. భద్రాచలం చుట్టూ ఆ కరకట్టే గనుక లేకుంటే ప్రసిద్ధ రామక్షేత్రం నిండా మునిగేది. పోలవరం నిర్మాణ దశలో ఉన్నప్పుడే ఈ స్థాయిలో ఇబ్బంది ఉంటే.. రేపు ప్రాజెక్టు పూర్తయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి గోదావరి నదికి ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలైలోనే కనీవిని ఎరుగని స్థాయిలో వరదలు వచ్చాయి. మరి ముఖ్యంగా 1986, 1994 నాటి పరిస్థితులను జ్ఞప్తి తీసుకొచ్చాయి.
తెలంగాణకు శాపం
ఎగువన పోలవరం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనివల్ల తెలంగాణలోని భద్రాచలం, ములుగు, పినపాక, నియోజకవర్గాల్లోని పరివాహక ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో వచ్చిన అకాల వర్షాల వల్ల ఈ ప్రాంతాలే తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టం కూడా అపారంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఆ రాష్ట్రానికి జీవధార అయి ఉండొచ్చు. కానీ ఆ నష్టాన్ని భద్రాచలం, పినపాక, ములుగు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా చవి చూస్తాయి. ఇప్పటికే పోలవరం కాఫర్ డ్యాం ద్వారా వస్తున్న నీరు భద్రాచలాన్ని అతలాకుతలం చేస్తోంది. శిల్పి నగర్, సుభాష్ నగర్, బూర్గంపాడు, పినపాక, మణుగూరు రూరల్ మండలాల పరిధిలోని గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.
Also Read: Chandrababu- YCP MLAs: అప్పుడే చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లిపోయారా? వైసీపీ ఎమ్మెల్యేలు అంత పనిచేశారా?
అందరి బాధ్యతరాహిత్యం
ప్రాజెక్టు నిర్మించే విషయంలో ఉండే ఉత్సాహం.. దాని తాలూకు ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించే విషయంలో మాత్రం ఉండదు. ప్రస్తుతం ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో అదే స్పష్టమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పిన టీఆర్ఎస్.. ఆ తర్వాత మాట మార్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాగూ బూర్గంపాడు, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, వరదామచంద్రపురం, ఎటపాక ప్రాంతాలు నీట మునిగిపోతాయి కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ భద్రాచలానికి కూత వేటు దూరంలో ఎటపాక, పురుషోత్తమాయపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల గ్రామాల్లో రామయ్యకు వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ గ్రామాలు ఏపీ పరిధిలో ఉన్నాయి. వీటిని ఇటీవల అరకు జిల్లా పరిధిలోకి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటీవల ఆ గ్రామాల్లో ఉన్న రామయ్య భూముల్లో అక్రమణలు పెరిగాయి. ఏకంగా ఆలయ ఈవో ధర్నా చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇక ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం చేపడుతున్నది. కానీ పునరావాసం తన బాధ్యత కాదు అన్నట్టు వ్యవహరిస్తోంది. అటు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా కేంద్రాన్ని నిలదీయలేక పోతున్నాయి. దీనివల్ల ముంపు బాధితులు అలో లక్ష్మణా అంటూ విలపిస్తున్నారు.
మొన్నటికి మొన్న సుందరయ్య నగర్ ప్రాంతం లో కరకట్టకు గండి పడటంతో వరద నీరంతా యటపాక నుంచి భద్రాచలాన్ని ముంచెత్తింది. కరకట్ట తెలంగాణ, ఆంధ్రా లో విస్తరించి ఉన్నది. కానీ దాని నిర్వహణను రెండు ప్రభుత్వాలు విస్మరించాయి. ఇక స్లూయిజ్ లోని మోటార్లు తరచూ మోరాయించడం ఇక్కడ పరిపాటిగా మారింది. సింగరేణి మోటార్లు ఇస్తే తప్ప నీటిని తోడే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం కరకట్ట నిర్వహణ కు రూపాయి ఇవ్వలేదు. ప్రస్తుతం పోలవరం కేంద్రమే నిర్మిస్తోంది కనుక దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను కూడా అదే పరిష్కరించాలి. గతంలో పోలవరం వల్ల తెలంగాణకు వాటిల్లే నష్టం పై అధ్యయనాలు జరిగాయి. కానీ తర్వాత వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ప్రస్తుత వర్షాలకు గోదావరి 70 అడుగులు మించి ప్రవహిస్తోంది. రేపటి నాడు పోలవరం పూర్తయితే భద్రాచలం పరిస్థితి ఏంటీ? భద్రాచలం దక్షిణ అయోధ్య గా బాసిల్లుతున్న ప్రాంతం.
మరీ ముఖ్యంగా కేంద్రం లోని బీజేపీకి రాముడు అంటే వల్ల మాలిన ప్రేమ. ఇలాంటి తరుణంలో పోలవరం నిర్మిస్తున్న కేంద్రం భద్రాచలం రక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలి. మరో వైపు రామయ్య ఆస్తులు ఎటపాక, గుండాల, పిచ్చుకల పాడు, పురుషోత్తమాయపట్నం, కన్నాయిగుడెం ప్రాంతాల్లో ఉన్నాయి కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం తో చర్చలు జరపాలి. ఆ గ్రామాలు తెలంగాణలో కలిస్తే రామయ్య ఆస్తులు కూడా రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కానీ ఆ దిశగా రాష్ట్రం ఆలోచించడం లేదు. రాముడికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్..ఇప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదు. తాజాగా పర్యటనకు వచ్చి వేయి కోట్లు ఇస్తామన్నారు. వీటిని విశ్వసించే పరిస్థితిలో భద్రాద్రి వాసులు లేరు. అటు కేంద్రం నిర్లక్ష్యం, ఇరు రాష్ట్రాల బాధ్యతా రాహిత్యం వల్ల భద్రాద్రి రెంటికీ చెడ్డ రేవడి అవుతోంది.