Chandrababu Naidu: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబును ఒక కాంగ్రెస్ ముఖ్యుడు కలిశారని.. పరామర్శ పేరుతో రాజకీయ సలహాలు, సూచనలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టిడిపి మద్దతు ఉందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ ఇద్దరి నేతల కలయిక హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుత తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టిడిపి నాయకుడు. చంద్రబాబుకు నమ్మిన బంటు. తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. స్వల్పకాలంలోనే టిపిసిసి పగ్గాలు అందుకున్నారు. అయితే రేవంత్ కాంగ్రెస్ నాయకుడే కానీ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమితంగా అభిమానిస్తాయి. ఇప్పటికీ రేవంత్ చంద్రబాబు పట్ల విధేయత కనబరుస్తారు. అందుకే రేవంత్ రెడ్డి ని సీఎం చేసుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని టిడిపి పోటీ నుంచి తప్పుకుందన్న ప్రచారం ఉంది. ఇటువంటి తరుణంలో చంద్రబాబును కాంగ్రెస్ ముఖ్యుడు ఒకరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అది కూడా ఒక అర్ధరాత్రి అని తెలియడం మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం చంద్రబాబు అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు పలువురు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నేత కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సదరు నాయకుడికి చంద్రబాబు దిశ నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఏపీ రాజకీయాల కోసమే చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. ఏకకాలంలో కెసిఆర్ తో పాటు బిజెపికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు ఈ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కీలకమని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి క్యాడర్ కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు టిడిపికి చెందిన బలమైన సామాజిక వర్గంతెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా ఎన్ని చేయాలో అంతగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రముఖుడు చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ ఇదంతా పరామర్శల పేరుతో తంతు పూర్తి చేసినట్లు బయట ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. అది పూర్తిగా చంద్రబాబు పుణ్యమేనని ప్రచారం చేసేందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు ఓ సామాజిక వర్గం ఆరాటపడుతున్నట్లు సమాచారం.