Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఆంధ్రప్రదేశ్ లో బలవంతుడెవరు? బలహీనులెవరు?

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో బలవంతుడెవరు? బలహీనులెవరు?

AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో విజేత ఎవరు అన్నది? రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధపడుతుండగా.. టిడిపి,జనసేన కూటమి కడుతున్నాయి. దీంతో హోరాహోరీ ఫైట్ తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి.దీంతో బలమైన నాయకుడు ఎవరు? బలహీనులు ఎవరు? అన్న చర్చ నడుస్తోంది. మధ్యలో నేషనల్ మీడియాల సర్వేలు సెగలు పుట్టిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చి.. కొత్తవారిని రంగంలోకి దించి రెండోసారి విజయం కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 నియోజకవర్గాలను మార్చాలని భావిస్తున్నారు. అయితే ఇందులో సాహసం కనిపిస్తున్నా.. అంతకంటే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ టిక్కెట్లు దక్కని వారు పార్టీపై అభిమానంతో పని చేస్తే పర్వాలేదు కానీ.. ఇతర పార్టీల్లోకి ఫిరాయించి.. కొత్త అభ్యర్థులను ఓడిస్తే అసలు లక్ష్యానికి ఎసరు వస్తుందని.. అప్పుడు నాయకత్వం అచేతనంగా మారడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

టిడిపి, జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. వీటి మధ్య సమన్వయం కుదిరింది. రెండు పార్టీల మధ్య సీట్లు, ఓట్ల సర్దుబాటు సక్రమంగా జరుగుతుందని సంకేతాలు వస్తున్నాయి. పొత్తునకు రెండు పార్టీల శ్రేణులు ఏనాడో మానసికంగా సిద్ధపడ్డాయి. పొత్తు సహించలేకపోయిన నేతలు బయటకు వెళ్ళిపోయారు. అటు పవన్ సైతం పార్టీ శ్రేణులకు హెచ్చరికలతో కూడిన సూచనలను చేశారు. పొత్తునకు విఘాతం కలగకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇవి వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రెండు పరిస్థితుల మధ్య సర్దుబాటు ఆశాజనకంగా ఉంది.

ఏపీలో బలం, బలహీనం వైరిపక్షాల్లో కనిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో మరోసారి అధికారంలోకి వస్తానని జగన్ భావిస్తున్నారు. అయితే మొన్నటి వరకు తనను చూసి ఓటేస్తారని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. మీపై వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ఇది ఓటమి కోసం సాకులు వెతుక్కోవడమేనని విశ్లేషణలు వస్తున్నాయి. పొత్తు ద్వారా బలంగా ఉన్నామని టిడిపి జనసేన చెబుతోంది. కానీ పొత్తుతో ఎక్కడ మా అవకాశాలు పోతాయోనన్న ఆందోళన ఆ రెండు పార్టీల నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచిన నాయకులు కొందరు బయటకు అడుగులు వేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం అభద్రతాభావంతో ఉన్నారు. అది రెండు పార్టీలకు మైనస్ గా మారింది. దీంతో బలం మాట పక్కన పెట్టి.. అధికారం కోసం రెండు పక్షాలు గట్టిగానే పోరాడుతున్నాయి.రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలతో బలం ఎవరికి ఉంది? బలవంతుడు ఎవరు? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version