Telangana- Janasena: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. కొత్త పొత్తులకు బాటలు పడుతున్నాయి. పార్టీల్లో నూతన జట్లకు బీజం పడుతున్నాయి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ మరోమారు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ, టీజేఎస్ తోపాటు జనసేన కూడా చేరుతుందని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరో వైపు తిరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా పోటీ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ఇది మింగుడుపడటం లేదు. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో 7 లేదా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.
తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ కు అభిమానులున్నారు. అసలు ఏపీ కంటే తెలంగాణలోనే పవర్ స్టార్ కు అభిమానులెక్కువ. దీంతో ఇక్కడ తమ ప్రభావం చూపించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో కొండగట్టు అంటే పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏ కార్యక్రమమైనా కొండగట్టు నుంచే ప్రారంభించడం ఆయనకు అలవాటు. అందుకే వచ్చే ఎన్నికల్లో కొండగట్టు నుంచే ప్రచారం నిర్వహించాలని చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారిని గుర్తుకు చేసుకున్నారు.
గతంలోనే కొండగట్టు అభివృద్ధికి రూ.11 లక్షల విరాళం అందజేశారు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ తెలంగాణ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మళ్లీ అడుగుపెట్టాలని భావిస్తున్నారు. దీంతో పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రాక రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం తీసుకురానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే అధికార టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురు కానుంది. పవన్ అభిమానులు జనసేనకు ఓటు వేస్తే అది బీజేపీకే లాభం చేకూరుస్తుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు ఉండటంతో టీడీపీ కూడా వీటితో కలుస్తుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలంటే బీజేపీకి మరో పార్టీ జతకట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో జనసేన, టీడీపీ కలిస్తే తెలంగాణలో అధికారం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. జనసేన వల్ల టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలే తగలనున్నాయి. దీంతో రాష్ర్టంలో పోటీలో నిలిచి తమ ఓటు బ్యాంకు మెరుగుపరచుకోవాలని జనసేన ఆశిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేసి అధికార పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.