President Droupadi Murmu: ఆడపిల్లకు చదువు ఎందుకనే సూటి పోటి మాటల మధ్యే ఆమె డిగ్రీ పూర్తి చేసింది. వంటింట్లో కుందేలు లాగా ఉండాలనే చివాట్ల మధ్యే నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా చేరింది. బ్యాంకు ఉద్యోగి ని పెళ్లి చేసుకున్నా అత్తామామలతో కలిసి పూరి గుడిసెలో ఉంది. అందులో ఉంటూనే రాజకీయ నాయకురాలు అయింది. ఎటువంటి నేపథ్యం లేనప్పటికీ తానే ఒక స్ఫూర్తి పథం అయింది. ఆమే భారత దేశ 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె చరిత్ర తరచి చూస్తే ప్రతి విషయం కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది. అసలు ద్రౌపది అనే పేరు ఆమెకు ఎవరు పెట్టారు? తమ వంశీయులైన సంథాలి తెగలో ద్రౌపది అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కనీసం ఆమె వారి వంశీయురాలైన దేవత కూడా కాదు. అసలు ఇంతకు భారతదేశ నూతన రాష్ట్రపతికి ద్రౌపది అని ఎవరు నామకరణం చేశారు?
పుటి అని అమ్మానాన్న పెట్టారు
ద్రౌపది ముర్ము పూర్వికులు ఒడిశాలోని మయూర్ భంజ్ కు చెందిన సంథాలి తెగవారు. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, చీరలు నేయడం, అడవి జంతువుల వేట వీరి ప్రధాన వృత్తులు. పూరి జగన్నాథుడిని ఇష్టంగా కొలుస్తారు. బలబద్ర, సుభద్రలను తమ ఇంటి ఆడపడుచులుగా భావిస్తారు. అలాంటి జాతిలో ఒడిశాలోని మయూర్ భము జిల్లా ఉపర్ బేడాలో 1958 జూన్ 20న అతి నిరుపేద కుటుంబంలో “పుటి” జన్మించారు. అనేక ఆటుపోట్ల మధ్య చదువు కొనసాగించారు.
Also Read: KTR Birthday: నడిరోడ్డుపై కేటీఆర్ జన్మదిన వేడుకలా?
1965 కాలంలో ఒడిశాలో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలల్లో పని చేసేందుకు ఏ అధ్యాపకులు ముందుకు రాలేదు. ఆ కాలంలో ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పించడంతో కొంతమంది ఇతర ప్రాంతాల వారు ముందుకు వచ్చారు. అందులో పుటి అనే అధ్యాపకుడు ఒకరు. అయితే “పుటి” పేరు ఆయనకు నచ్చకపోవడంతో మహాభారతంలోని ద్రౌపది పేరును ఆమెకు నామకరణం చేశారు. అప్పటినుంచి ఆమె పుటి కాస్త ద్రౌపది అయింది. సంథాలి వారికి ద్రౌపది అని పలకలేక దృపది, దుర్పతి అని పిలిచేవారు. వాస్తవానికి సంథాలి తెగలో పుట్టిన అమ్మాయికి నానమ్మ పేరు, అబ్బాయికి నాన్న పేరు పెట్టడం ఆనవాయితీ. మొదట్లో ద్రౌపదికి ఆమె పేరు చివరన “తుడు” అనే ఇంటి పేరు ఉండేది. శ్యామ్ చరణ్ ను వివాహమాడాక అతడి ఇంటి పేరు “ముర్ము” ఈమె పేరు చివరన చేరింది.
ద్రౌపది స్ఫూర్తితో.. ఎంతోమంది..
రాజకీయాల్లోకి వచ్చాక ద్రౌపది ముర్ము చాలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పట్లో ఒడిశాలోని మారుమూల గ్రామాల్లో వయోజన విద్యకు శ్రీకారం చుట్టారు. ఎంతో వెనుకబడి ఉన్న అటవీ ప్రాంతాల్లో స్త్రీలకు విద్యపై అవగాహన కల్పించారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ ఉండాలని అప్పట్లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. చాలామంది మహిళలు సర్పంచులుగా, ఎంపీటీసీలు, జడ్పిటిసిలుగా గెలుపొందారు. మహిళా ఆర్థిక సాధికారతకు కూడా ద్రౌపది చాలా కృషి చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు స్త్రీలకు విరివిగా రుణాలు మంజూరు చేయించారు. దానివల్ల వారి ఆర్థిక స్వావలంబన పెరిగింది. వారు దినదినాభివృద్ధి చెంది పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. ద్రౌపది ముర్ము చేసిన కృషి వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే గిరిజన మహిళలు.. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు పార్టీలకు అతీతంగా జై కొట్టారు. అంతెందుకు సాక్షాత్తు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ద్రౌపతి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు అంటే ఆమెకు ఉన్న గిరిజన బలాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలలో స్త్రీలకు రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేసే ద్రౌపది ముర్ము ప్రస్తుతం దేశ ప్రథమ పౌరురాలు అయ్యారు. ఆమె హయాంలో అయినా తమకు రిజర్వేషన్లు లభిస్తాయని మహిళలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read:TDP MPs: తలోదారిలో టీడీపీ ఎంపీలు? అసంతృప్తికి కారణాలేంటి?