Pawan Kalyan: రాజకీయంగా, ప్రజాభిమానంలో రోజురోజుకు దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతుందా? ఆయన్ని ఎదుర్కోవడం అసాధ్యమని భావిస్తున్న ప్రత్యర్ధులు ఏకంగా అంతం చేయాలని చూస్తున్నారా? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుండి జనసేన ప్రధాన నాయకులకు అందిన సమాచారం ఏంటీ? ఈ ప్రశ్నలు ప్రతి సగటు పవన్ అభిమాని విస్తుపోయేలా చేస్తున్నాయి. కొద్దిరోజులుగా పవన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆయనను బౌతికంగా ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆందోళన చెందుతూ జనసేన ముఖ్యనేత పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ అధికారిక ప్రకటన చేశారు.

ఈ ప్రకటనలో కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పై భౌతిక దాడి జరగవచ్చని కేంద్రం నుండి సమాచారం అందింది. విశాఖ వేదికగా ఈ కుట్ర అమలు చేయాలని భావించారు. అశేష అభిమాన సందోహం మధ్య ప్రత్యర్థుల ప్రణాళిక పారలేదు. అయితే పవన్ పై దాడి చేయాలన్న వారి ఆలోచన అలానే ఉంది. మూడు రోజులుగా పవన్ కదలికలపై నిఘా పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు పవన్ ఇల్లు, కార్యాలయాల వద్ద సంచరిస్తున్నారు.
పవన్ ఎప్పుడు ఎక్కడకు వెళతారు. ఆయన దినచర్య ఏమిటని గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కారును కొన్ని గుర్తు తెలియని వాహనాలు అనుసరిస్తున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలతో పవన్ కళ్యాణ్ పవన్ కారును వెంబడిస్తున్నవారు అనుమానాస్పదంగా ఉన్నారు. వారు ఖచ్చితంగా అభిమానులు కాదని పవన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. సోమవారం ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి పవన్ ఇంటి ముందు హైడ్రామా చేశారు.పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, నాదెండ్ల మనోహర్ కుట్ర కోణాన్ని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తున్న వాహనాల్లో ఒకదానిపై ఏపీ రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు అని రాసి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ సామాజిక వర్గం ఈ కుట్రలో భాగమైందా? అయితే వారు ఎవరు? అనే సందేహాలు కలుగుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో కీలక విషయాలు బయటికొచ్చే అవకాశం కలదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.