TV9 Falling: సప్లై డిమాండ్.. ఈ సూత్రం దేనికైనా వర్తిస్తుంది. మీడియాకు ఇంకా బాగా వర్తిస్తుంది. అప్పట్లో అర్ణబ్ గోస్వామి అనే న్యూస్ ప్రెసెంటర్ టైమ్స్ నౌ ఛానల్ లో పనిచేసేవారు. వాగ్దాటి, విషయాలపైన విశ్లేషణ ఉండటంతో ప్రైమ్ అవర్స్ లో అతడికి రెండు గంటలపాటు స్లాట్ ఇచ్చేవారు. ఇదే ఆ ఛానల్ ను బార్క్ రేటింగ్ లో ముందు ఉంచేది. మీడియా అంటేనే రాజకీయాలు, నానా చెత్త ఉంటాయి కాబట్టి అర్ణబ్ ఎదుగుదలను ఓర్వలేని ఓవర్గం మేనేజ్మెంట్ కు రకరకాల చాడీలు చెప్పింది. మొదట దీనిని లైట్ తీసుకున్న యాజమాన్యం తర్వాత గోస్వామి వివరణ కోరింది. దీనికి నొచ్చుకున్న అతడు రిపబ్లిక్ టీవీ పేరిట కొత్త ఛానల్ ను ఏర్పాటు చేశాడు. బిజెపికి డబ్బా కొట్టే ఛానల్ లో అదీ ఒకటి. కానీ ఇప్పటికీ ప్రైమ్ అవర్స్ లో దాన్ని కొట్టే ఛానల్ లేదంటే అతిశయోక్తి కాదు. తాను వెలుగులోకి తెచ్చిన అర్ణబ్ గోస్వామి అనే మొక్కను టైమ్స్ నౌ పీకేయడంతో ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. ఒకప్పుడు తెలుగులో టీవీ9 అనే న్యూస్ ఛానల్ నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఎన్ని ఆరోపణలు వచ్చినా రవి ప్రకాష్ దానిని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. టీవీ9 తెలుగు విజయవంతం కావడంతో కన్నడ, గుజరాతి, భారత వర్ష అనే ఛానళ్ళు ఏర్పాటయ్యాయి. ఏ ప్రకారం చూసుకున్నా కూడా టీవీ9 నెట్వర్క్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. అంత పెద్ద సాధన సంపత్తి ఉన్న నెట్వర్క్ 18 కూడా ఒక్కోసారి వార్తలు అందించడంలో విఫలం అవుతూనే ఉంటుంది. కానీ టీవీ9 ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. ఎందుకంటే రవి ప్రకాష్ వేసిన పునాదులు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి.
-పొమ్మన లేక పొగ పెట్టారు
ఎప్పుడైతే రవి ప్రకాష్ ను సాగనంపారో, అప్పుడే టీవీ9 లోకి మై హోమ్ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీ తెర వెనుక కెసిఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక 550 కోట్ల డీల్ తో టీవీ9 జూపల్లి రామేశ్వరరావు సొంతమైంది. అప్పటిదాకా ప్రైమ్ అవర్స్ లో న్యూస్ ప్రజెంటర్ గా ఉన్న రజనీకాంత్ చానెల్ సీఈవో అయ్యారు. ఈయన హయాంలోనే టీవీ9 కొత్త ఆఫీసులోకి వెళ్ళింది. కార్పొరేట్ హంగులు అద్దుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అప్పటిదాకా బాగా పనిచేసిన సీనియర్లందరినీ మేనేజ్మెంట్ బయటికి పంపింది. ఇందుకు మోపిన కారణం వారంతా కూడా రవి ప్రకాష్ అనుయాయులని. వారు వెళ్లాక టీవీ9 పతనం మొదలైంది. ఒకప్పుడు నెంబర్ వన్ స్థానంలో తిరుగులేని ఛానల్ గా ఉన్న టీవీ9 ఇప్పుడు నెంబర్ టు పొజిషన్లోకి వెళ్ళటమే దారుణం.
Also Read: NDTV Prannoy Roy: ఎన్టీటీవీ ప్రణయ్ రాయ్ ఎందుకు అప్పుల పాలయ్యారు? ఎందుకు అమ్ముకుంటున్నారు?
-టీవీ9లో ఎందుకు ఈ సమస్య?
టీవీ9 ఛానల్ వచ్చిన కొత్తలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమైంది. అప్పట్లో స్క్రిప్ట్ రైటర్లుగా సీనియర్ జర్నలిస్టులు ఉండేవారు. వారందరికీ కూడా రవి ప్రకాష్ కాంపౌండ్ నుంచి ఆ సహాయ సహకారాలు అందేవి. అవే టీవీ9 ఛానల్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి. కానీ ఎప్పుడైతే రవి ప్రకాష్ ను బయటకు వెళ్లగొట్టారో అప్పుడే నాణ్యమైన రైటర్లందరినీ పొమ్మన లేక పొగబెట్టారు. ఇక అప్పటినుంచి టీవీ9 ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పైగా చానల్ ప్రసారం చేస్తున్న పలు కార్యక్రమాలు వివాదాస్పదమవుతున్నాయి. ఆ మధ్య దేవి చేసిన రుధిర వ్యాఖ్యలు, విశ్వక్ సేన్ తో వ్యవహరించిన తీరు ఛానల్ పరువును మంటగలిపాయి. ఇదే సమయంలో ఎన్ టివి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
-ఇప్పుడు రమ్మంటున్నారు..
రవి ప్రకాష్ శిష్యుడుగా ముద్రపడ్డ మురళి టీవీ9 నుంచి వెళ్లిపోయాడు. ఎప్పుడైతే ఛానల్ స్థానం రెండుకు పడిపోయిందో వెంటనే చేరుకున్న రజినీకాంత్ మురళిని మళ్లీ టీవీ9 లోకి ఆహ్వానించాడు. ఇదే తీరుగా 10టీవీ కి వెళ్ళిపోయిన రోహిత్ ని, కంటెంట్ హెడ్ మధుని భారీ ప్యాకేజీ ఇచ్చి మళ్లీ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా కంటెంట్ రైటర్లు కావాలని నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే టీవీ9 రజినీకాంత్ చేతిలోకి రావడంతో ఛానల్ పై పూర్తి అజమాషీ కొరబడిందని ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యానికి చానల్ నిర్వహణపై పట్టు లేకపోవడం, గతంలో ఉన్న ఉద్యోగులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడం వల్ల ప్రసారాలలో నాణ్యత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన బార్క్ రేటింగ్స్ లో ఎన్టీవీ మొదటి స్థానం, టీవీ9 రెండో స్థానం, వి6 మూడో స్థానం, టీవీ5 నాలుగో స్థానం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఐదో స్థానంలో నిలిచాయి. వాస్తవానికి పసుపు డబ్బా కొట్టే టీవీ ఫై నాలుగో స్థానంలోకి పడిపోవడం దాని స్వయంకృతాపరాధమే. గతంలో టీవీ9 తో పోటీపడే ఆ ఛానల్ ఇప్పుడు నాలుగులోకి వెళ్లిపోయింది. అయితే ఈ జాబితాలో ఏబీఎన్ ఐదో స్థానంలోకి రావటమే ఆసక్తికరం. కానీ ఇప్పటికీ రూరల్ ప్రాంతాల్లోని రేటింగ్స్ పరిశీలిస్తే టీవీ9 మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఈ బాక్ రేటింగ్స్ కూడా అంత పారదర్శకం అని చెప్పలేము. గతంలో రిపబ్లిక్ టీవీ విషయంలో కూడా ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది.
చివరగా చెప్పొచ్చేదేంటంటే జర్నలిజం అనేది ఒక ప్రొఫెషనల్ ఇజం. దానికి ఎంత స్వేచ్ఛ ఉంటే జనంలోకి అంతగా చొచ్చుకుపోతుంది. దాని చుట్టూ ఎన్ని బంధనాలు విధిస్తే అంతగా కుంచించుకుపోతుంది. అది టీవీ9 కావచ్చు. మరేదైనా కావచ్చు. టీవీ9 ర్యాంకు పడిపోవడం యాజమాన్యానికి మింగుడు పడకపోవచ్చు కానీ.. అది ఆ ఛానల్ పై ప్రేక్షకులు ప్రకటిస్తున్న నిరసన. అంతే అంతకుమించి ఏమీ లేదు.
Also Read:‘Liger’Memes : ‘పూరి’‘కొండన్నా’ ఏంటన్నా ఇదీ.. లైగర్ ఫ్లాప్ పై హోరెత్తుతున్న మీమ్స్..
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Who are the factors behind the fall of tv9 what actually happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com