https://oktelugu.com/

మనిషి ప్రయాణం..

కరోనా కాటుకు మనుసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సీజన్ లభించడం లేదు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ దొరుకడం లేదు. వాక్సిన్ వేయించుకోండి అని చెప్పుడే గానీ వాక్సిన్ కేంద్రాలకు వెళితే వాక్సిన్ అందుబాటులో ఉండడం లేదు. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలై కొడారిపోయే పరిస్తితిలో ఉన్నాయి. ఈ పరిస్తితికి కారణం ఎవరూ అంటే చాలా మంది.. మరి ప్రజలు కాకుంటే మరెవరు అవుతారు అని ఎదురు ప్రశ్న వస్తున్నది. దేశంలో గత ఏడు సంవత్సరాలుగా గతంలో అంతగా లేనట్టి ఒక […]

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2021 9:44 am
    Follow us on

    కరోనా కాటుకు మనుసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సీజన్ లభించడం లేదు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ దొరుకడం లేదు. వాక్సిన్ వేయించుకోండి అని చెప్పుడే గానీ వాక్సిన్ కేంద్రాలకు వెళితే వాక్సిన్ అందుబాటులో ఉండడం లేదు. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలై కొడారిపోయే పరిస్తితిలో ఉన్నాయి. ఈ పరిస్తితికి కారణం ఎవరూ అంటే చాలా మంది.. మరి ప్రజలు కాకుంటే మరెవరు అవుతారు అని ఎదురు ప్రశ్న వస్తున్నది.

    దేశంలో గత ఏడు సంవత్సరాలుగా గతంలో అంతగా లేనట్టి ఒక కొత్త భావజాలం వేగంగా వ్యాప్తి చెందుతోంది. అది ఏమంటే? ప్రశ్నించడాన్ని సహించలేకపోవడం. తాము చెప్పిందే నమ్మాలి, వినాలి, ఆచరించాలి, అన్న అహంకారం, అధికారమై కాటువేస్తున్నది. ప్రశ్నకు జవాబు లేని ఒక మూడత్వాన్ని, నేనే గొప్ప, నా జాతే గొప్పా, నా మతమే గొప్ప అనే ఒక దురహంకారానికి లోనైన ఒక వికృత మానవ నైజం కాదన్నోన్ని దేశ ద్రోహి, పాకిస్తానీ, కమ్యూనిస్ట్, అర్బన్ నక్సలైట్ అని వాని మీద బడి కాలిపిక్కలను కరుస్తున్నది.

    నిజానికి ఈ భూమి పైన ఎన్ని సార్లు జీవరాశి శూన్యమై పునర్నిర్మాణమై ఈ 20 లక్షల సంవత్సరాల ఆధునిక మానవుని (హోమోసేపియన్స్) జీవిత కాలంలో ఎన్నెన్ని ప్రస్తానాలు ఎక్కడెక్కడి నుండి ఎక్కడెక్కడిదాక జరిగినాయో అన్న ఒక శాస్త్రీయమైన అవగాహన కలిగి ఉంటే వాళ్ళే చెప్బుతున్నట్లుగా ఈ వసుదైక కుటుంబం లో మానవులుందరూ ఒకటే, సమానమే. అందరికీ గాలి నీరు భూమి అనే పంచబూతాలపై సమానమైన హక్కులు ఉంటాయి అన్న విషయం అర్థం అవుతుంది. ఒకప్పుడు భూమి, ఇప్పుడు మనం చూస్తున్న ఏడు ఖండాలుగా విభజించవడి లేకుండే అన్నది, ఈ భూమిపైన ఇదివరకు ఐదు సార్లు 440 బిలియన్, 365 బిలియన్, 250 బిలియన్, 210 బిలియన్ చివరగా 65 బిలియన్ సంవత్సరాల క్రితం సర్వం నిర్మూలనమైపోయింది అని ఫాసిల్స్ లో నిక్షిప్తమై ఉన్న శిలాజాల ద్వారా కార్బన్ టెస్ట్ తో శాస్త్రీయంగా నిరూపించబడ్డ సత్యం.

    – ఐస్ ఏజ్.. మంచు యుగం.
    46 లక్షల సంవత్సరాల నుంచి 26 లక్షల సంవస్తారాల క్రితం వరకు దఫాదఫాలుగా మంచుయుగం ఈ భూమి పైన వచ్చినట్లు శిలాజాలు చరిత్రను నిక్షిప్తం చేశాయి. అప్పుడూ సర్వం నిర్మూలన అయింది. అలాగే 70 వేల సంవస్తారాల క్రితం ఇండోనేషియాలోని తోబా అగ్నిపర్వత విస్పోటనం వలన కొన్ని వేల మైళ్ళ దూరం లో ఉన్న దక్షిణ మధ్య భారతం పైన కొన్ని మీటర్ల మందంగా ధూళి , బూడిద వచ్చిపడ్డాయి. అనేక వృక్షాలు జంతువులు తుడిచిపెట్టుక పోయాయి. అనేక మంది ఆదిమ మానవులు మరణించారు. కర్ణాటకలోని జ్వాలాపురంలో ఆదిమ జాతుల నివాస ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో మీటర్ల మందాన పేరుకొని పోయి ఉన్న ధూళి ని గమనించారు. ఆ ధూళి తోబా అగ్నిపర్వతం నుండి వెలువడ్డదిగా నిర్ధారించారు.

    ఆ తర్వాత 12000 సంవత్సరాల నుండి అరేబియా నుండి కొత్తగా వచ్చిన మానవ సమూహాలు కొత్త రాతి యుగానికి స్వీకారం చుట్టాయి. పదునైన రాతి పనిముట్లను తయారుజేసుకొని సంచార నివాసం నుండి స్టిర నివాస ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. పశ్చిమ ఆసియాలోని జేరికో, బలూచిస్తాన్ లోని మెహర్ గడ్ వంటి ప్రదేశాల్లో గ్రామాలు వెలసినాయి. ఆ కాలంలో పశ్చిమ ఆసియా నుండి మధ్యధరప్రాంత జాతులు, దక్షిణ ఇరాన్ నుండి ఏలమైట్ జాతులవారు, సింధు ఉత్తరప్రాంతాలైన పంజాబ్, స్వాత్ లోయ, గాంధారా, వక్షు నది ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రీ.పూ. 6000 నాటికి వక్షునది నాగరికత ప్రారభం అయ్యింది. సింధు నాగరికత క్రీ.పూ. 3000 నాటికి ఉచ్ఛదశ చేరుకోవడంతో ఆ నాగరికత ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, తూర్పున పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలవరకు విస్తరించింది. కొత్తరాతి యుగపు ఆదిమ జాతులను కూడా తనలో ఇముడ్చుకొంది.

    దాదాపు 10 వేల ఏళ్ల క్రితం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల నుంచి ఆస్ట్రలైడ్ జాతులవారు తిరిగి వెనుకకు వచ్చి భారత ఈశాన్య ప్రాంతంలో స్తిరపడ్డారు. వీరిలో నాగాలు, బోడోలు, చక్మాలు, కూకీలు, అంగామీలు, ఖాసీలు, తదితర జాతులు మాట్లాడే వివిధ భాషలు ఆస్ట్రోలైడ్ మూలాలు కలిగిఉన్నాయి. హిమాలయ పర్వత ప్రాంతాలకు చైనా ప్రాంతాల నుండి మంగోలాయిడ్ జాతుల ప్రజలు వచ్చి స్టిరానివాసాలు ఏర్పాటుజేసుకున్నారు. వీరినే వేదకాలంలో కిరాతులుగా ప్రస్తావించారు. వీరే కాక తోబా అగ్నిపర్వత భారీ విస్పోటనం తర్వాత జరిగిన వలసలలో అస్త్రలాయిడ్ జాతులకు చెందిన ఆదివాసులుగా పిలువబడే గొండ్లు, కోయలు, చెంచులు, తదితర అనేక జాతులవారు, ఒరిస్సా,మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలల్లోకి వలస వచ్చి ఇప్పటికీ నివసిస్తున్నారు. వీరే కాక అండమాన్ దీవులలోనూ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ , నీగ్రోలాయిడ్ జాతులవారు నివసిస్తున్నారు. వీరికి మధ్య ఆఫ్రికా జాతులవారి మూలాలు ఉన్నట్లుగా జన్యుపరీక్షలో తేలింది.
    ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మానవజాతి అనేక చేర్పులు మార్పులకు లోను అవుతూ ప్రకృతి శక్తులతో నిరంతరం పోరాడుతూ నిలిచి ఉంది.

    ఇక క్రీ పూ. 3000 సంవత్సరాల నుంచి ఉన్న హరప్పా, మహొంజొదారో , సింధూ నాగరికత స్తానంలో వచ్చిన ఆర్య నాగరికత అదో చరిత్ర. అసలు సిందూ నాగరికతే ఆర్య నాగరికత అనీ, అదే మొదటి నుండి ఉంది. సింధూ లేదు ద్రావిడ లేదు అనే ఒక మొండి వాదన చారిత్రిక ఆధారాలు లేని, ప్రపంచ చరిత్రకారులెవ్వరూ అంగీకరించని ఒక వితండ వాదన చేస్తున్నారిప్పుడు కొందరు. రాహుల్ సాంకృత్యాన్ రాసిన ఓల్గాసే గంగా, మర్ల విజయ్ కుమార్ రాసిన భారతీయుల మూలాలు చదివినా సింధు నాగరికత నుంచి ఆర్యుల నాగరికత వరకు భారత దేశంలో జరిగిన చరిత్ర తెలుస్తుంది. ఈ పుస్తకాలకు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. వట్టి పుక్కిటి పురాణాలు ప్రామాణికం కాజాలబోవు. అందులో ఉన్నది చరిత్ర కాజాలబోదు . ఒక కథ, ఒక నవల, ఒక ప్రబంధ సాహిత్యం, ఒక పురాణ సాహిత్యం, మాత్రమే. అవన్నీ ప్రజల మధ్యన ఉండే సంబంధ బాంధవ్యాలను, జీవన విధానాలను, ఆహార విహారాలు, ఆహార్యం, ఆలోచనా విధానాలను మాత్రం చెపుతాయి.

    సింధు నాగరికత విధ్వంసం తర్వాత ఆయా పొలిమెరల్లో నివసించే భిల్లులు, సంతాలులు, గొండ్లు, తదితర జాతులు మధ్యభారంలోకి తరలి వచ్చారు. క్రీ. పూ.1800 నాటికి చోటనాగ్పూర్ ప్రాంతంలో ఇనుప వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టి ఇనుప యుగానికి నాంది పలికారు. క్రీ.పూ. 500 నాటికి పర్షియా సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా నుండి పశ్చిమ ఆసియా, పర్షియా, తూర్పు సింధు ప్రాంతం , ఆఫ్ఘనిస్తాన్, తుర్కుమేనిస్తాన్, తజకిస్తాన్ వరకు విస్తరించింది. నేటి యుగోస్లేవియా, అల్బేనియా, టర్కీదక్షిణ భాగం, అశ్శీరియ, జోర్డాన్ ప్రాంతాలలో నివశిస్తున్న గ్రీకులు, వీరందరని కలిపి యవనులు అనే వారు. పర్షియన్ చక్రవర్తి దారియన్ ఆ కాలంలో ఈ యవన సైనికులను తన రాజ్యం లోని ఆఫ్ఘనిస్తాన్ లోని గాంధారాకు తీసుకువచ్చారు. పర్షియన్ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత, క్రీ.పూ. 326లో అలెగ్జాండర్ సింధు నది ప్రాంతం వరకు విస్తరించాడు. గ్రీకు రాజ్యం సెల్యూకస్ వారసుడు మినాండర్ బౌద్ధాన్ని స్వీకరించి మిళిందునిగా ప్రసిధ్ధి చెందాడు. ఇండో గ్రీక్ రాజ్యాలు పతనమయ్యాక ఆ యవన సైన్యాలను అనేక రాజ్యాలు ఉపయోగించుకున్నాయి. కాలక్రమంలో వారు క్షత్రియులుగా బ్రాహ్మణులుగా భారతసమాజంలో విలీనం అయ్యారు.

    క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి దాదాపు 600 సం. పాలించిన పర్షియన్ రాజులు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరపంజాబ్ వరకు తమ రాజ్యాన్ని విస్తరించారు. తర్వాత సింగియాంగ్ ప్రాంతం నుండి దండెత్తి వచ్చిన ఇండో యూరోపినులైన శకుల దాడితో ఇండో గ్రీకు రాజ్యాలు పతన దశకు చేరుకున్నాయి. శకులు జన్యుపరంగా ఆర్యులకు దగ్గరి వారు. అయితే చైనా లోని గ్వాంగ్జూ ప్రాంతంలో నివసించే మరో ఇండో యూరోపియన్ జాతి యుయఝీలు వీరు శకుల రాజ్యాన్ని ఆక్రమించుకొని క్రీ. పూ. 50 నాటికి కుశాన్ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్నారు. కుశాన్ రాజులలో కనిష్కుడు ప్రముఖుడు. ఈ విధంగా ఉత్తరాన ఉన్న పచ్చిక మైదానాల గుండా అనేక జాతుల వారు దక్షిణ ఆసియాలో రాజ్యాలు స్టాపించుకొని కాలక్రమేణా వారంతా కూడా భారతీయులలో కలిసి పోయారు. క్రీ.శ. 5,6 శతాబ్దంలో తుర్కెమినిస్తాన్ నుండి శ్వేతహూణులు దోపిడి ప్రధానంగా దాడులు జరిపి వారు తిరిగి వెనుక్కు పోలేదు. 11వ శతాబ్దం నుండి 7 వందల ఏండ్ల పాటు తురుష్కులు పాలించారు. జొరాష్ట్రీయన్ మతస్తులైన పార్శీలు పశ్చిమ భారత్ లో ప్రవేశించారు. ఆఫ్రికా జాతులైన అబిసీనియన్లను ఇతర తూర్పు ఆఫ్రికా దేశస్తులను ఇక్కడికి అంగరక్షకులుగా తెచ్చుకున్నారు.

    17వ శతాబ్దం నుండి యూరోపియన్లు ఈ దేశాన్ని పరిపాలించారు. అలా ఆంగ్లో ఇండియన్లు, ఫోర్చుగీసువారు, టిబెటీయులు , ఇరానీయులు ఆఫ్ఘనిస్తాన్ వారు భారత దేశం లో స్తిరపడ్డారు. 1947 దాకా భారత దేశం నానా జాతుల సమితి. అందుకే భారత దేశం ఒక గణతంత్ర రాజ్యం. అనేక మతభేదాలతో, కులబెధాలతో వేల సంవస్తారాల నుండి ఇక్కడ కలిసి మెలిసి సోదరభావం తో నివశిస్తున్నాయి. ఒక్క భారతదేశం లోనే కాదు. అన్ని ప్రపంచదేశాల దేశాల్లో ఇదే విధమైన అన్ని జాతుల, అన్ని మతాల, అన్ని రంగుల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఈ మతస్తులే ఉండాలి, ఈ రంగు వాళ్లే ఉండాలి , ఈ జాతివారే ఉండాలి అని మాట్లాడటంలో అర్థం లేదు. జాతి మతమూ రంగు అన్ని మనుషులు ఏర్పాటుచేసుకున్న పరిధులు మాత్రమే. భారతదేశంలో హిందూయిత్వం, , అమెరికాలో ట్రంప్ ఇజమ్, ఆస్ట్రేలియాలో స్కాట్ మార్సియనిస్మ్, యు.కె.లో బోరిస్ జాన్సనిజమ్ ఇట్లా ఏ దేశానికి ఆ దేశం ప్రజలను వేర్పాటు వాదం వైపు నడిపిస్తున్నాయి. కానీ మానవుల యొక్క సహజస్వభావం మనుషులను వెదుక్కోవడం. కలిసి ఉండడం.

    పోనీ మనుషులను విడదీస్తున్న ఈ మతరాజకీయాలు, జాతి రాజకీయాలు, ప్రజలందరి శ్రేయస్సు కోసం ఏమైనా చేస్తున్నాయా అంటే అదీ లేదు. ఇది అలనాటి రాచరిక వ్యవస్థ నాటి నుండి కూడా లేదు. రాజు సుప్రీం. దాన్ని స్తిరత్వం చేయడానికి పూజారివర్గం, కండబల వర్గం ఎలాగూ ఉండనే ఉనాయి. ప్రజలు పనిజేసే యంత్రాలు మాత్రమే. సంక్షేమ రాజ్యాలు, రాజ్యాంగం , ప్రజాస్వామ్యం అంటూ వచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. 1698 లో స్టీమ్ ఇంజిన్ కనుక్కున్న తర్వాత 1860 ప్రాంతం లో వచ్చిన పారిశ్రామిక విప్లవం , పెట్టుబడి శ్రామికులను సృస్టిస్తే ఆ తర్వాత శక్తికి అవసరమైన బొగ్గు, పెట్రోలియం, వచ్చిన తర్వాత సాంకేతిక అభివృధ్ధి జరిగి ఆ తరువాత భూమి పైన, భూమి లోపల ఉన్న సకల వనరులను దోచుకోవడం ప్రారంభం అయింది. భూమి భోమితోబాటుగా ఉన్న అన్ని సహజసంపదలను ప్రజలందరికీ సమానంగా పంచవల్సిన బాధ్యతల ను వదిలి వేసిన పాలక పక్షం అవన్నీ డబ్బున్న సంపన్నులకు దోచి పెడుతూ అదే చాలా గొప్ప అభివృధ్ది అని ఊదరగొడుతున్నది.
    ఒక్క మతాన్ని నీ చేతిలో పెట్టి నీకున్నదంతా గోచిగుడ్డతో సహా సంపన్నులకు దోచిపెట్టి కార్యక్రమం ఒకవైపు నిరాఘాటంగా సాగుతుంటే, నేనే గొప్ప, నా మతమే గొప్ప అంటో ఎంతకాలమైతే ప్రజలు ఆ మాయలో ఉంటారో అంతకాలం తమ వెనుకబాటు తనానికి ఆ ప్రజలే కారణ మౌతారు.

    అమెరికాలో ఎలాన్ మస్క్ అనే ఒక టెక్నో క్రాట్, పెట్టుబడిదారు, బ్యాటరీ కార్లు తేవడంతో బాటుగా ఇప్పుడు ఎస్ఎన్ 15 అనే ఒక కొత్త 15 అంతస్తుల రాకెట్ కనుక్కొని రేపు అంగారక గ్రహం మీదికి రాకపోకలు సాగిస్తాడట. అంటే ఈ గ్రహాన్ని మానవయోగ్యం కాకుండా జేసీ ప్రపంచ సంపన్న వర్గాలు అంగారకునికి పైకి లేచిపోయే ప్రయత్నం ఒకవైపు సాగుతుంటే ఇక్కడ మన భారతదేశం లాంటి చోట్ల రోగులకు కనీసం ఆక్సీజన్ అందించలేని పరిస్తితిలో ఉంటూ నా దేశం , నా మతం, నా జాతి అంటూ శుష్కవాదాలు చేస్తూ, పురాణ పాత్రలు జన్మ స్థలాల పరిశోధనలో, ఆ పాత్రల పుట్టిన రోజులు, వివాహాది శుభకార్యాలు జరిపించుటలో తరించి పోండొ అంటూ ఎంతకాలం మనుషులను భ్రమల్లో ఉంచుతారు? ప్రజలు గొర్రెల్లా తలలూపడం మానుకొని ఇకనైనా మేల్కొని మనలో మనం కొట్టుకోవడం మానివేసి ప్రశ్నించడాన్ని నేర్చుకొని ప్రకృతిని కాపాడుకొంటూ పరిమితంగా మాత్రమే ప్రకృతి సంపదలను వాడాలని నినదిస్తూ ఉత్పత్తి అయిన సంపద సమానంగా పంచబడాలే అని, అందరికీ ఒకే విధమైన, ఒకే నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందే వరకు పాలక వర్గాన్నీ ప్రశ్నించండి.

    -వీరగొని పెంటయ్య. రాష్ట్ర ఉపాధ్యక్షులు
    రైట్ ఎజుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ. కరీంనగర్.