Badvel Bypoll: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అందరి దృష్టి బద్వేల్ పై పడింది. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో విజయం కోసం పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుండగా వైసీపీ, టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తాయని భావించినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయం వెల్లడించారు. బద్వేల్ ఉప ఎన్నికలో పాల్గొనడం లేదని చెప్పి బీజేపీలో ఆలోచన పెంచారు. దీంతో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ రాజశేఖర్ ను బరిలో దింపేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రకటన బీజేపీని డైలమాలో పడేసింది. చంద్రబాబు సైతం జనసేన-బీజేపీ పొత్తుతో ఓట్లు చీలిపోయి వైసీపీ విజయం మీద ప్రభావం చూపుతుందని భావించినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ సంప్రదాయం పేరుతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మరోవైపు వైసీపీ ఇక్కడ గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బారాయుడు కరోనాతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎక్కడ అభ్యర్థి చనిపోయినా ఏకగ్రీవం చేసే విధంగా పార్టీల్లో నిర్ణయాలు ఉన్నా ఇక్కడ మాత్రం పోటీ చేసేందుకు నిర్ణయించుకోవడంతో ఎన్నిక నిర్వహణపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
బద్వేలులో తమ బలమెంతో చూసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అభ్యర్థిని పోటీలో దింపడంతో ఇక వెనకకు జరగడం కష్టమే. దీంతో ఈ ఉప ఎన్నిక జరగడానికి పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ ఎన్నికలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో తెలుసుకోవాలని టీడీపీ ఆలోచిస్తోంది. వైసీపీ మెజార్టీ తగ్గుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీంతో ఇందులో వైసీపీ మీద టీడీపీ ఎంత మేర విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.