Pawan Kalyan: తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు పై ఉమ్మడి కార్యాచరణ కొనసాగుతోంది. అదే సమయంలో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. మరోవైపు బిజెపి కలిసి వస్తుందని టిడిపి, జనసేన ఎదురుచూస్తున్నాయి. ఈ వారంలో జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అప్పుడు కానీ ఇటు టిడిపి, అటు జనసేన అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదు.
ఈసారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. గత ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారా? కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారని వైసీపీ ఆశగా ఎదురుచూస్తోంది. పవన్ ఎక్కడ బరిలో దిగితే అక్కడ బలమైన అభ్యర్థిని దించాలని భావిస్తోంది. జనసేన శ్రేణులు కంటే వైసీపీయే పవన్ పై, పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కానీ ఈసారి పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని.. వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బయటపెడతారని ప్రచారం జరుగుతోంది.
కాకినాడ సిటీ నుంచి పవన్ పోటీలో దిగుతారని ఒక అంచనా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండడంతో పవన్ ఎక్కడ పోటీ చేసినా.. భారీ మెజారిటీ నమోదయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఒకచోట 16000, మరోచోట 8,000 ఓట్లతో పవన్ ఓడిపోయారు. ఈసారి మాత్రం గట్టిగా దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. జగన్, చంద్రబాబును సాధించే మెజారిటీలను అధిగమించాలని చూస్తున్నారు. అటువంటి నియోజకవర్గాలను ఎంచుకోవాలని భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, బిజెపి నిర్ణయం వెల్లడయ్యే వరకు గోప్యంగా ఉంచాలని చూస్తున్నారు. పండుగ తరువాత పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో.. హై కమాండ్ నుంచి ఒక ప్రత్యేక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది.