Komatireddy Brothers:: మునుగోడులో గత ఎన్నికల్లో 91 శాతానికిపైగా పోలింగ్ జరిగితే.. ఈ సారి మరో శాతం పెరిగింది. సాధారణంగా ఉపఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదవుతుంది. కానీ ఈసారి రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పెరిగింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్‌కు అనుకూల తీర్పు ఇచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుస్తారని ప్రకటించాయి. కారణం ఏదైనా అధికార పార్టీ అడ్వాంటేజ్ టీఆర్‌ఎస్‌కు బాగా కలసి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఫలితం తేడా వస్తే.. ముందుగా మునిగిపోయేది కోమటిరెడ్డి బ్రదర్సే.

వ్రతం చెడినా ఫలితం దక్కదు…
మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసి ఏరికోరి ఉప ఎన్నికలు తెచ్చారు. విజయం కోసం బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు, జాతీయ నేతలు, కేంద్ర హోమంత్రితోపాటు ఇతర మంత్రులు కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడం ఇప్పుడు బీజేపీ పార్టీ కంటే.. ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని టెన్షన్ పెడుతోంది. ఫలితం ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చినా బీజేపీలో రాజగోపాల్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గుతుంది. మరోవైపు తమ్ముడి కోసం కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించి అన్న కోమటిరెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఓ బ్యాడ్ క్యారెక్టర్ అన్న విధంగా ప్రొజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు కూడా కాంగ్రెస్‌లో భవిష్యత్ ఉండదు. తమ్ముడు ఓడిపోయిన తర్వాత వెంకటరెడ్డి బీజేపీలో చేరితే ఆయనకూ ప్రయోజనం ఉండదు.
రిస్కులో ‘బ్రదర్స్’ రాజకీయ భవితవ్యం..
మొత్తంగా చూస్తే కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిత్యం ఎటు చూసినా రిస్కులో ఉన్నుట్ల కనిపిస్తోంది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కూడా ఉంటుందో.. ఊడుతుందో చెప్పడం కష్టం. ఉపఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. రాజగోపాల్‌రెడ్డి ఓడితే.. బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం విషయంపై మరింత గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది. ఏడాది కూడా లేని తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపిస్తూంటే.. కనీసం కౌంటర్ ఇవ్వలేని స్థితికి బీజేపీ నేతలు చేరారు.

6వ తేదీ తర్వాతే అసలు రాజకీయం..
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు 6తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల తర్వాతే తెలంగాణలో అసలు రాజకీయం జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై కూడా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది. బీజేపీ కోరినట్లు సీబీఐ, ఈడీతో విచారణకు అనుమతి ఇస్తే సీఎం కేసీఆర్ మళ్లీ డిఫెన్స్‌లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ సీబీఐ ఐతే రాష్ట్రంలోకి రావొద్దని జీవో 51 ఇచ్చారో అది కోర్టు తీర్పుతో రద్దవుతుంది. సీబీఐ తెలంగాణలో అడుగు పెడితే.. కేసీఆర్ ఆరోపణల నేపథ్యంలో కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు రాజకీయం ఆరో తేదీ తర్వాత జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.