https://oktelugu.com/

నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో పదవులు దక్కించుకొని నాడు హవాచాటిన ముగ్గురు నేతలు నేడు ఎక్కడా కన్పించడం లేదు. సీఎం కేసీఆర్ వారికి కేటాయించిన శాఖలను సమర్థవంతం నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఎలాంటి అవినీతి మరకలు అంటకుండా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా కొనసాగారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ వీరికి వారి నియోజకవర్గంలోనే సీటు కోసం సీఎం కేసీఆర్ ను అభ్యర్థించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇద్దరు నేతలకు తమ సిట్టింగ్ స్థానం కైవసం చేసుకోగా ఒకరు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 09:57 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో పదవులు దక్కించుకొని నాడు హవాచాటిన ముగ్గురు నేతలు నేడు ఎక్కడా కన్పించడం లేదు. సీఎం కేసీఆర్ వారికి కేటాయించిన శాఖలను సమర్థవంతం నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఎలాంటి అవినీతి మరకలు అంటకుండా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా కొనసాగారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ వీరికి వారి నియోజకవర్గంలోనే సీటు కోసం సీఎం కేసీఆర్ ను అభ్యర్థించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇద్దరు నేతలకు తమ సిట్టింగ్ స్థానం కైవసం చేసుకోగా ఒకరు ఎమ్మెల్యేగా అత్యల్ప మెజార్టీతో గెలుపొందగా మరొకరు ఓటమిపాలయ్యారు. ఇంకొకరు అసలు బరిలోనే లేకుండా పోయారు.

    Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

    ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరనేగా మీ ప్రశ్న.. వారేవరో కాదు.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి. వీరిలో ముఖ్యంగా కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి కేసీఆర్ క్యాబినెట్లో నాటకీయంగా మంత్రి పదవులు దక్కాయి. కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి తన క్యాబినెట్లోకి తీసుకున్నాడు. దీంతో ఆయన ఎంపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా కడియం శ్రీహరికి కేసీఆర్ డిప్యూటి సీఎంతోపాటు విద్యాశాఖ మంత్రి కేటాయించారు. ఈ శాఖను కూడా కడియం శ్రీహరి సమర్థవంతంగా నిర్వహించారు. అయితే 2018ముందస్తు ఎన్నికల్లో కడియంకి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం గమనార్హం.

    టీడీపీకి చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు నాటి ఎన్నికల్లో ఓటిమిపాలయ్యారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ తుమ్మలను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీని చేసి ఆయన మంత్రి పదవీలో కొనసాగేలా లైన్ క్లియర్ చేశారు. కేసీఆర్ క్యాబినెట్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ శాఖను తుమ్మల కూడా సమర్థవంతంగా నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే తుమ్మల కూడా కడియంలానే సిట్టింగ్ స్థానం కోసం పోరాడాల్సి వచ్చింది. చివరకు పాలేరులో సిట్టింగ్ స్థానాన్ని పొందినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన గెలువలేదు. సొంతపార్టీ నేతలే ఆయనను ఓడించారనే ప్రచారం సాగింది.

    ఇక మాజీ స్పీకర్ మ‌ధుసూద‌నాచారి విష‌యంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ తొలి స్పీకర్ గా మధుసూదనాచారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోసం పోరాడాల్సి వచ్చింది. చివరకు సీటు దక్కించుకొని అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆయనకు మంత్రివర్గంలో, స్పీకర్ గా అవకాశం రాలేదు. దీంతో మధుసూదనాచారి నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా కిందిస్థాయి నేతలను కలుపుకొని పోకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతోనే అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్లడంతో కేసీఆర్ వీరిని పక్కకు పెట్టారనే టాక్ విన్పిసుంది.

    Also Read: టీఆర్ఎస్ నేత కోసం బీజేపీ ఎదురుచూపు?

    అయితే ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు పరిమితం కావాల్సి వస్తోంది. వీరి కంటే జూనియర్లకు మంత్రి పదవులు దక్కడంతో వీరంతా నిరాశకు లోనవుతున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే గతంలో కేసీఆర్ వీరికి ఇచ్చిన గౌరవంతో పార్టీని వీడలేకపోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీకి వెళితే పదవులు ఇవ్వలేదని పార్టీ వీడుతారా? అనే విమర్శలు తప్పవు. దీంతో ఈ నేతలు అధికార పార్టీలోనే కొనసాగుతున్నారనే టాక్ విన్పిస్తుంది. అయితే భవిష్యత్ లోనూ ఈ నేతలు టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? లేదా అనేది వేచిచూడాల్సిందే..!