
ఏపీలో సీఎం జగన్ ప్రజల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అయితే లబ్ధిదారులకు ఎంతవరకు చేరాయన్నది మాత్రం ప్రశ్నార్థంకంగా మారుతుంది. ప్రస్తుత ఆపద సమయంలో వైద్య రంగానికి సంబంధించి ప్రజలను ఆదుకునే స్కీంలు తీసుకొస్తున్నా వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యం జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పుడు ప్రతీ వ్యక్తికి అవసరమయ్యే 104 అంబులెన్స్ సకాలంలో బాధితులకు చేరడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర పరిస్థితులు ఆదుకునే ఈ పథకమే సక్రమంగా సాగకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గత ఏడాది సీఎం జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ లో 104 అంబులెన్స్ లను ప్రారంభించారు. ఒకేసారి పెద్ద ఎత్తున వాహనాలు ప్రారంభించి పాటు కాల్ చేస్తే నిమిషంలో 104 వాహనం వాలుతుందని ప్రకటించారు. అయితే ప్రాంభంలో ఉన్న హడావుడి అమలులో మాత్రం లేదు. సాధారణ సమయంలో పక్కనబెడితే గతేడాది కరోనా ప్రారంభంలో 104 వాహనం అస్సలు రెస్పాన్స్ లేదని పలువురు పేర్కొంటున్నారు. అసలు విషయమేంటంటే ప్రభుత్వంతో కీలక ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఓ సారి కాల్ చేస్తే ఆయనకే రెస్పాన్స్ రాలేదని కొందరు వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.
వాస్తవానికి సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో 108 పేరుతో ఉచిత అంబులెన్స్ లను ప్రారంభించారు. 108 కాల్ చేస్తే చాలు కుయ్.. కుయ్.. అనే సౌండ్ వస్తుందని ఆర్భాటంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం సక్సెస్ కూడా అయింది. 108 అంబులెన్స్ వాహనాలు సక్రమంగా పనిచేయడానికి పర్యవేక్షణ కూడా చాలా పకడ్బందీగా ఉండేది. ఒక రకంగా వైఎస్ మానసపత్రికగా ఈ పథకాన్ని పేర్కొన్నారు.
అయితే జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వాటి అమలులో మాత్రం చాలా లోపాలుంటున్నాయని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇలా చేస్తే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి నిష్ప్రయోజనంగానే ఉంటాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాల అమలులో కఠినంగా ఉంటేనే సగటు పేదవాడు లబ్ది పొందుతాడని పలువురు సూచిస్తున్నారు.