రాజకీయ దుమారం రేపిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం మరుగున పడినట్లయింది. ఓ వారం రోజుల పాటు అన్ని పత్రికలు, చానళ్లలలో రాజేందర్ ఎపిసోడ్ బాగానే నడిచినా ప్రస్తుతం స్తబ్దుగా ఉండిపోయింది. టీఆర్ఎస్ ఉద్దేశమేంటి? ఆయనను పార్టీలో కొనసాగిస్తున్నట్లా? లేక సస్పెండ్ చేసి ఇంటికి పంపినట్లా? ఏది తెలియడం లేదు. ధీంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు రాజేందర్ భవిష్యత్ వ్యూహమేంటి? పార్టీ పెడతారా? లేక ఇదే పార్టీలో కొనసాగుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా చాటున
కరోనా ప్రబలం కావడంతో ఈటల రాజేందర్ గురించి అందరు మర్చిపయినట్లయింది. ఆయన గురించి ఏవేవో కథనాలు వెలువడ్డాయి. కొత్త పార్టీ పెడతారని, నాయకులను సమీకరిస్తున్నారని పలు ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. కానీ చివరికి ఏమీ లేదని తేలిపోయింది. పార్టీ పెట్టి గులాబీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ మళ్లీ ఆలోచనలో పడినట్లుంది. ఏం చేయాలనే దానిపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనట్లు కనబడుతోంది. దీంతో ఈ వ్యవహారం గురించి మరచిపోయారు.
అధినేత మదిలో..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మదిలో ఏముందో తెలియడం లేదు. సాధారణంగా పార్టీ విధానాలపై విమర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ముందుండే కేసీఆర్ ఈ దఫా ఎందుకో వెనకడుగు వేశారు. భూ కబ్జా వ్యవహారంలో బాధ్యుడుగా తేల్చినా రాజేందర్ ను పార్టీ నుంచి బహిష్కరించారే కానీ ఇంకా ఏ రకమైన క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో ఆ భూముల వ్యవహారంలో ఇంకా చాలా మంది ఉన్నట్లుతెలియడంతో కినుక వహించినట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈటల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని విశ్లేషకులు చెబుతున్నారు
ఈటల వ్యూహమేంటి?
ఈటల రాజేందర్ ఎటు వైపు వెళతారో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. కొత్త పార్టీ పెడతారనే వార్తలు వ్యాపించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తాత్సారం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టి దాన్ని నడపడం అంటే మాటలు కాదు. దానికి చాలా డబ్బు కావాలి. నాయకులు కావాలి. కార్యకర్తలు కావాలి. సహనం ఉండాలి. ఇవన్నీ ఇమిడించుకున్న నాయకుడే పార్టీని నడపగలుగుతారు. అందుకే రాజేందర్ కొత్త పార్టీ వ్యవహారాన్ని కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.