Mullah Hibatullah Akhundzada: అఫ్గాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్(Taliban) కీలక నేతగా భావిస్తున్న లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా ఇంతవరకు కనిపించలేదు. దీంతో ఆయన జాడపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న కీలక సమయంలో కూడా ఆయన జాడ కానరాకపోవడంతో ఆయన పాకిస్తాన్ ఆర్మీ ఆదీనంలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తాలిబన్లకు సుప్రీం లీడర్లుగా వ్యవహరించే వారు బాహ్య ప్రపంచానికి కనిపించడం అరుదే. ఇంతకు ముందు ఉన్న వారు కూడా ఇలాగే రహస్య ప్రదేశాల్లోనే ఉండేవారు. కానీ వారు బతికే ఉన్నారో లేదో కూడా ఇంతవరకు తెలియడం లేదు.
తాలిబన్ల వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా ఒమర్ 2013లో మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం తాలిబన్లకు చీఫ్ గా వ్యవహరించిన అఖ్తర్ మన్సూర్ 2016లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. 2016 మే నుంచి తాలిబన్ ల సుప్రీం లీడర్ గా హైబతుల్లా అఖుంద్ జాదా(Hibatullah Akhundzada) నియమితుడయ్యాడు. తాలిబన్లకు నేతృత్వం వహించిన మూడో నాయకుడు ఇతడే.
60 ఏళ్ల వయసున్న అఖుంద్ జాదాను తాలిబన్ల బృందంలో కేవలం సైనికుడిగానే కాకుండా రాజకీయ, మిలిటరీ న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. తాలిబన్లకు నాయకత్వం వహిస్తోన్న ఐదారుగురు కీలక నేతల్లో హైబతుల్లా అఖుండ్ జాదా ముందున్నారు. అయితే తాజాగా అఫ్గాన్ తాలిబన్ల నియంత్రణంలోకి వచచిన తరువాత హైబతుల్లానే పాలనా పగ్గాలు చేపడతారనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది.
అఫ్గాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సిరియా, ఆఫ్రికా దేశాల్లో ఆల్ ఖైదా, ఐసిస్ ప్రాబల్యం పెంచుకునే విధంగా ప్రయత్నాలు సాగిస్తాయని తెలుస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొందని తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర ముఠాలకు కొందరు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.