https://oktelugu.com/

Telangana Politics: తెలంగాణలో రాజకీయం ఎటు వైపు పోతోంది.?

Telangana Politics: తెలంగాణలో రాజకీయం ఎటు వైపు పోతోంది. ఇన్నాళ్లు ఎదురే లేకుండా ఉన్న టీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీ సవాలు విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని చెబుతుంటే టీఆర్ఎస్ కూడా బీజేపీపై ఒంటికాలుతో లేస్తోంది. నగరంలో మత కల్లోలాలు రెచ్చగొడుతున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు నగరంలో మత కలహాలు రేగడానికి ప్రధాన కారణం ఎవరు? మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు తీసుకొచ్చి కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టి చోద్యం చూసింది […]

Written By: Srinivas, Updated On : September 17, 2022 8:49 am
Follow us on

Telangana Politics: తెలంగాణలో రాజకీయం ఎటు వైపు పోతోంది. ఇన్నాళ్లు ఎదురే లేకుండా ఉన్న టీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీ సవాలు విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని చెబుతుంటే టీఆర్ఎస్ కూడా బీజేపీపై ఒంటికాలుతో లేస్తోంది. నగరంలో మత కల్లోలాలు రెచ్చగొడుతున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు నగరంలో మత కలహాలు రేగడానికి ప్రధాన కారణం ఎవరు? మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు తీసుకొచ్చి కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టి చోద్యం చూసింది మాత్రం టీఆర్ఎస్సే అని బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు మరోమారు భగ్గుమంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇంకా పరిణామాలు మారే సూచనలే కనిపిస్తున్నాయి.

Telangana Politics

Telangana Politics

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు పక్కనపెట్టి ఇతర పనులు చేస్తూ తామే గొప్ప అని చెప్పుకుంటోంది. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎంగా చేస్తామని చెప్పి, కాంటాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు తుంగలో తొక్కి ఇప్పుడు తాము కల్యాణ లక్ష్మి, రైతు బంధు, ఇరవైన నాలుగు గంటల కరెంటు అంటూ డప్పు కొట్టుకుంటోంది. దీంతో రెండు పార్టీల మధ్య అగాధం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ప్రధానం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పై ప్రశంసలు కురిపించడంతో ఇక రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతాయనే అభిప్రాయం కూడా వస్తోంది. దీనికి తగ్గట్లు వారిలో మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నా మిగతా వారంతా టీఆర్ఎస్ పాలన ఆహా అంటూ కితాబివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

Also Read: Komaram Bheem Adivasi Bhavan: నిన్న దళితులు.. రేపు గిరిజనులు.. మరో సంచలనానికి తెరతీయబోతున్న కేసీఆర్‌!

శాసనసభలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్ప మిగతా వారంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరినట్లు అనుమానిస్తున్నారు. ఖమ్మంకు దళితబంధు పథకం వర్తింపుతో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కలో మార్పు వచ్చినట్లు అప్పటి నుంచే కనిపిస్తోంది. దీంతో అధికార పార్టీ తనకు ఎదురు లేకుండా చేసుకునే క్రమంలో కాంగ్రెస్ ను కమ్మేసినట్లు చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్ కు ప్రధాన శత్రువుగా మిగిలింది బీజేపీ ఒక్కటే. దీంతో వారిని సభలో లేకుండా చేసి మళ్లీ వారినే నిందిస్తున్నారు. వారికి సభలో ఉండటం ఇష్టం లేదేమో అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు సంఘటనలు చూస్తే అర్థమవుతోంది.

దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ , హైదరాబాద్ ఎంపీ స్థానాలు చేజిక్కించుకున్న బీజేపీ టీఆర్ఎస్ కు సవాలు విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపుతామని ప్రతిన బూనుతోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగో విడత రంగంలోకి దూకారు. అధికార పార్టీ అక్రమాలే లక్ష్యంగా విమర్శలు చేస్తూ ప్రజాబలాన్ని కూడగడుతున్నారు. 2024లో గులాబీ పార్టీని భూస్థాపితం చేయాలని మార్గనిర్దేశం చేస్తున్నారు. కార్యకర్త్లల్లో నూతనోత్తేజం నింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ నేతలను కూడా రప్పిస్తూ వారితో టీఆర్ఎస్ ను గంగలో కలపాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో బీజేపీ కొరకరాని కొయ్యగా తయారయిందనే ఉద్దేశంతోనే బీజేపీపై ఆగ్రహం పెంచుకుంటోంది.

Telangana Politics

bjp, trs, congress

ఇందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేసుకుని మంత్రుల నుంచి సీఎం వరకు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడాలని హితవు పలుకుతున్నారు. తెలంగాణలో తమ పాలన భేష్ గా ఉందని వాపును చూసుకుని బలుపుగా భావించుకుంటున్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా తామేదే అద్భుతాలు చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. తామేదో ప్రజలను ఉద్దరిస్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. దీంతో వారి మైనస్ లు వెలుగులోకి రాకుండా చూసుకుంటున్నా ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారు. కీలెరిగి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

తమది ధనిక రాష్ట్రమని పదేపదే చెబుతున్నారు. మరి ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు సమయానికి ఇవ్వడం లేదు. పింఛన్లు ఎందుకు వేయడం లేదు. అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లోనే తూగుతోంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతున్నా వాస్తవానికి తెలంగాణ కూడా అప్పుల్లోనే మూలుగుతోంది. దీంతోనే మన ఆర్థిక పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే మారుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపడం కష్టసాధ్యమే. కానీ ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా కేంద్రంతో పెట్టుకుని కేసీఆర్ సాధించేదేమిటో అర్థం కావడం లేదు. ఏపీ సీఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అప్పులు తెచ్చుకుని పాలన సాగిస్తున్నారు. మన సీఎం మాత్రం కేంద్రంతో పెట్టుకుని ఇప్పుడు ఎలా ముందుకు వెళతారో తెలియడం లేదు.

ఇంకా మూడో కూటమి అంటూ రాష్ర్టాలు పర్యటిస్తున్నారు. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయిఏరినట్లు.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందన్నట్లు రాష్ట్రంలోనే సక్రమంగా పాలన చేయలేని సీఎం కేంద్రంలో ఏం చేస్తారో తెలియడం లేదు. ఉత్తరాది వారు దక్షిణాది వారిని అంత తేలిగ్గా రానీయరు. ఈ విషయం గతంలో కూడా రుజువైంది. చంద్రబాబు అప్పట్లో ఆ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో మౌనంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం తానేదో చేస్తానని ప్రగల్బాలు పలుకుతూ అందరిని కూడగడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యమే. అటు బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను కూడగట్టినా పెద్ద ప్రయోజనం ఉండదని తెలియడం లేదు. పనికి రాని చెత్త అంత పోగయితే ఏమవుతుంది కుళ్లిపోతుంది. అంతేకాని బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతామని ప్రతిన బూనుతున్న సీఎం కేసీఆర్ బంగాళాఖాతంలో కలిసిపోతారని కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

Also Read: Gautam Adani: ప్రధాని జిగ్రీ ఫ్రెండ్‌ ప్రపంచంలోనే నంబర్‌.2.. మోదీ పాలనలోనే ఎలా ఎదిగాడబ్బా!?

Tags