Cyber Attack on WhatsApp: భారత్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో మొత్తం సమాచార వ్యవస్థ స్తంభించి జనాలు, ఉద్యోగులు, ఆఖరుకు ప్రభుత్వాలు కూడా షేక్ అయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ హఠాత్ పరిణామానికి అలెర్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు కూడా వాట్సాప్ ద్వారానే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిలిచిపోయిన వాట్సాప్ సేవలపై ఆరాతీశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వాట్సాప్ సేవలు తిరిగి పునరుద్ధరించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వాట్సాప్ సేవలు 2 గంటలు నిలిచిపోయినా కానీ అటు వాట్సాప్ సంస్థ, దాని మాతృసంస్థ మెటా నుంచి కానీ.. దీని అధినేత మార్క్ జుకర్ బర్గ్ నుంచి కానీ ఎలాంటి వివరణ లేకపోవడంతో ఇది ‘సైబర్ దాడి’ అని కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది. సైబర్ దాడి కనుకనే తమ వీక్ నెస్, అసమర్థతను బయటపెట్టలేక వాట్సాప్ యాజమాన్య సంస్థ సైలెంట్ గా ఉందని వార్తలు వస్తున్నాయి. సైబర్ దాడి కారణంగానే దేశంలో వాట్సాప్ నిలిచిపోయినట్టు కేంద్రానికి సమాచారం అందడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాను ఈ మేరకు కేంద్రం వివరణ కోరినట్టు తెలిసింది. భారత్ లో వాట్సాప్ పై సైబర్ దాడి జరిగిందా? అన్న కోణంలో కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇంతసేపు వాట్సాప్ సేవలను నిలిచిపోవడానికి కారణాన్ని తెలుపాలని మెటా ఇండియాను కేంద్రం ఆదేశించింది.

దీనిపై పూర్తి వివరాలు సమర్పిస్తామని మెటా ఇండియా బదులిచ్చింది. ఈ ఘటన వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయా? లేక నిజంగానే సైబర్ దాడి వినియోగదారుల డేటా ఏమైనా గల్లంతైందా? అన్న దానిపై కేంద్రం ఆరా తీస్తోంది.