వాట్సాప్.. ఇప్పుడు ఇది లేనిదే మనకు పూట గడవదు.. తిండి, నిద్ర ఎలాగో ఇప్పుడు వాట్సాప్ కూడా నిత్యావసరమైపోయింది. ఇప్పుడు మన పనులు, వ్యవహారాలు, ఆఫీసు చర్చలు, సమీక్షలు అన్నింటికి వాట్సాప్ ఒక సాధనంగా మారిపోయింది. అయితే వాట్సాప్ అప్పట్లో తెచ్చిన ప్రైవసీ పాలసీలపై దుమారం రేపింది. వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ తో వాట్సాప్ సమాచారం పంచుకోవడాన్ని చాలామంది తమ వ్యక్తిగత భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ షేరింగ్ ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే కొందరు ఢిల్లీ హైకోర్టుకు కూడా దీనిపై ఎక్కారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ సరికాదని.. ఫేస్ బుక్ తో పంచుకోవద్దని పిటీషన్ వేశారు. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద గోప్యతా విధానం (ప్రైవసీ పాలసీ) ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
ఫేస్ బుక్ తో డేటా షేరింగ్, రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనలో నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.
అయితే ఈ పాలసీని అంగీకరించే నిర్ణయాన్ని వినియోగదారులకే వదిలేస్తున్నామని.. వారిపై ఒత్తిడి చేయబోమని వాట్సాప్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ తరుఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే తెలియజేశారు.
వాట్సాప్ కొత్త పాలసీ ఫిబ్రవరిలోనే అమల్లోకి రావాల్సింది. అయితే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మే 15వరకూ వాయిదా వేశారు. అయితే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం రాసిన లేఖపై వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల భద్రతకే తొలిప్రాధాన్యమని స్పష్టం చేసింది.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదానికి దారితీశాయి. ఇవి అమలు చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని.. అందుకు తాము సిద్ధంగా లేమని పేర్కొంటూ వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది. ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వాట్సాప్ కోర్టుకు సంచలన ప్రకటన చేసింది.